ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా! | Arvind Kejriwal to Have Manish Sisodia as Deputy Chief Minister | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!

Published Fri, Feb 13 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

కేజ్రీవాల్ తో సిసోడియా

కేజ్రీవాల్ తో సిసోడియా

  • ఏడుగురు మంత్రులతో ఢిల్లీ కే బినెట్
  •  లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు జాబితా పంపిన ఆప్
  •  మంత్రివర్గంలో నాలుగు కొత్త ముఖాలు
  •  అసెంబ్లీ స్పీకర్‌గా రాం నివాస్ గోయల్
  • న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడుగురు మంత్రులతో ఆప్ సర్కారు కొలువుదీరబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. 2013లో ఆప్ సర్కారులో మంత్రులుగా పనిచేసిన రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి, గిరీశ్ సోనీ స్థానాల్లో నలుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు.

    వీరిలో జితేంత్ర తొమార్(త్రినగర్), సందీప్ కుమార్(సుల్తాన్‌పురి మజ్రా), ఆసిమ్ అహ్మద్ ఖాన్(మతియా మహల్), గోపాల్‌రాయ్(బాబర్‌పూర్) ఉన్నారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే కావడం గమనార్హం. గత కేబినెట్‌లో పనిచేసిన సత్యేంద్ర జైన్‌కు ఈసారి కూడా మంత్రిగా అవకాశం దక్కింది. ఏడుగురి పేర్లతో కూడిన మంత్రుల జాబితాను పార్టీ గురువారం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు అందజేసింది. శనివారం రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్‌తోపాటు వీరంతా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

    కొత్త కేబినెట్‌లో అహ్మద్ ఖాన్ ఒక్కరే మైనారిటీ వర్గానికి చెందిన నేత కాగా, మహిళలకు ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా రాం నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్‌గా బాందన కుమారిలను నియమించనున్నారు. ఆప్ మహిళా విభాగానికి కుమారి నేతృత్వం వహిస్తున్నారు. కౌశాంబిలోని కేజ్రీవాల్ నివాసంలో బుధవారం రాత్రి సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ).. ఎవరెవరినీ మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అంశంపై చర్చించి ఏడుగురి పేర్లను ఖరారు చేసింది.
     
    ఇక కేజ్రీవాల్ ‘జాతీయ’ దృష్టి..

    సిసోడియాకు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించి, కేజ్రీవాల్... ఆప్‌ను జాతీయస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే సిసోడియా పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించి నూతన జవసత్వాలు అందించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం వెనుక ఆయన పాత్ర అత్యంత కీలకం. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కేజ్రీవాల్ భావించారు. 2013నాటి కేబినెట్‌లో ఈయన ముఖ్యమైన విద్య, ప్రజా పనులు, భూమి, భవనాలు, పట్టణాభివృద్ధి శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా అవే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement