జైల్లో నిద్రపోలేని ఆశారాం బాపు
బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యి ఏడు ఊచలు లెక్కపెడుతున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు (72)... రాజస్థాన్లోని జైల్లో సరిగా నిద్రపోలేకపోయారట. అసలాయనకు అక్కడ నిద్రే పట్టలేదట. రోజూ పట్టు పరుపుల మీద పవళిస్తూ.. శిష్యులు (శిష్యురాళ్లు) సకల సేవలు చేస్తుండగా, హాయిగా కునుకు తీసే ఆశారాం.. ఇప్పుడు కటిక నేలమీద ఒక చాప మాత్రం వేసుకుని పడుకొమ్మంటే నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారట.
రాజస్థాన్లోని జైల్లో 14 రోజుల రిమాండు ఖైదీగా ఉన్న ఆశారాం బాపును.. బారక్లో కాకుండా ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. రాత్రంతా ఆయనను దోమలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ''ఆశారాం బాపు ఒక చాపమీద పడుకున్నారు. ముందుగా ఆయన తన గది పరిసరాలను పరిశుభ్రం చేయడానికి గంగాజలం చల్లారు. కొందరు ఖైదీలు ఆయనకు కావల్సిన అవసరాలు చూశారు'' అని జైలు వర్గాలు తెలిపాయి. జైల్లో ఇతర ఖైదీలకు పెట్టే ఆహారాన్ని తీసుకోడానికి ఆయన నిరాకరించడంతో పాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు.
అయితే, ఆశారాం ప్రత్యేక ఖైదీ హోదా అనుభవిస్తున్నారన్న వాదనను మాత్రం జైలు వర్గాలు కొట్టిపారేశాయి.