మహిళా కానిస్టేబుల్‌పై వేధింపులు.. ఏఎస్ఐ డిస్మిస్
పంజాబ్ పోలీసులలో నేరస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దోపిడీ కేసులో నిందితుడైన ఒక ఏఎస్ఐని వారం రోజుల క్రితమే డిస్మిస్ చేయగా తాజాగా మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన కేసులో మరో ఏఎస్ఐ డిస్మిస్ అయ్యారు. తనకు వాట్సప్‌లో అసభ్య సందేశాలు పంపడంతో పాటు, మద్యం మత్తులో ఉండి ఒకసారి తనను బలవంతంగా కౌగలించుకున్నాడని కుల్దీప్ సింగ్ అనే ఏఎస్ఐ మీద ఆ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దాంతో కుల్దీప్ సింగ్‌ను డిస్మిస్ చేస్తూ పోలీసు కమిషనర్ ఆర్ఎన్ ఢోకే ఆదేశాలు జారీచేశారు.
మొదట్లో ఆయన తన అందాన్ని పొగిడేవారని, తర్వాత తనను తనిఖీ చేసే నెపంతో హాస్టల్ వద్ద వదిలేవారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన అతిచేష్టలకు ఎదురు తిరిగినా, తనను కౌగలించుకున్నప్పుడు విదిలించుకున్నా కూడా తనను డిస్మిస్ చేయిస్తానని బెదిరించారని తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత ఏసీపీ స్థాయి అధికారి ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ఆమె చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో ఏఎస్ఐని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆయన మీద కేసు నమోదు చేశారు. అది ఇప్పుడు దర్యాప్తులో ఉంది.
కుల్దీప్ సింగ్ మీద గతంలో కూడా రెండుసార్లు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. 2007లో లూధియానాలో నేరపూరిత విశ్వాసరాహిత్యానికి పాల్పడినందుకు ఆయన మీద ఒక కేసు నమోదైంది. 2015లో లూధియానాలోనే అవినీతి కేసు ఒకటి నమోదైంది. ఇలాంటి అధికారిని ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగించడం ఏమాత్రం సరికాదని సీపీ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయనను కొనసాగిస్తే ప్రభుత్వ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు కూడా భంగం వాటిల్లుతుందని తెలిపారు.