కాళేశ్వరం: తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం! | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం: తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం!

Published Wed, Jun 19 2024 2:00 AM | Last Updated on Wed, Jun 19 2024 12:30 PM

-

ఎవరికై నా చెబితే చంపేస్తానని తుపాకీతో బెదిరింపులు

నోరు తెరిస్తే.. బూతు పురాణం 

చికెన్‌ కోసం చిల్లర బుద్ధి

పనిచేసిన ప్రతీచోట రాసలీలలు..

కాటారం సబ్‌డివిజన్‌లోని ఎస్‌ఐ బాగోతం

అతనిపై లైంగిక వేధింపుల కేసు?

పోలీసులు అంటే ఒక నమ్మకం.. ప్రజల మాన, ప్రాణాలు కాపాడేవారని భరోసా. కానీ ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని చూస్తే ఆ స్టేషన్‌లోని వారికే ఒక చిరాకు.. స్త్రీలోలుడు.. గతంలో పనిచేసిన చోటా ఇదే పని.. కన్నేసిన ఆడవారిని అనుభవించేదాకా వదలడు. అందుకు ఎంతదూరమైనా వెళ్తాడు. తన సర్వీస్‌ రివాల్వర్‌తో బెదిరించి మరీ తన కామవాంఛ తీర్చుకుంటాడు. అలాంటి ఘటనే ఇది. సొంత స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ పోలీస్‌ కామాంధుడి అరాచకాలు ఆ సబ్‌ డివిజన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.        

వరంగల్‌క్రైం:సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరులోనే దేవత ఉంటుంది. కానీ అతను.. మహిళలంటే కేవలం కోరికలు తీర్చే వస్తువు అనుకుంటాడు. అతను పనిచేసేది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌ డివిజన్‌లోని ఓ స్టేషన్‌లో. ఇరవై రోజుల క్రితం తనకు కాలు విరిగింది.. ఇంటికి వచ్చి సాయం చేయమని తన స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌ను వేడుకోగా, తను మానవత్వంతో ఇంటికి వెళ్తే తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

 ఈ విషయం బయట తెలిస్తే చంపేస్తానని బెదిరించడంతో ఆమె బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మళ్లీ ఆమె ఇంటికి వచ్చిన సదరు ఇన్‌స్పెక్టర్‌ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె తనలో తాను కుంగిపోతోంది. సదరు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రాసలీలలే కాదు.. మరిన్ని బాగోతాలు ఉన్నట్లు కాటారం డివిజన్‌లో చర్చ జరుగుతోంది. 

ఇతని వ్యవహారశైలిపై ‘సాక్షి’కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. అతను నోరు తెరిస్తే బూతు పురాణం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే మహిళలకు వణుకు పుడుతుంది. తన ఎదురుగా వెళ్తే నోటికొచ్చిన మాట అనేయడం ఆయనకు సర్వసాధారణం. గతంలో ఫిర్యాదుదారులతో నోటికి వచ్చినట్లు మాట్లాడి పలుమార్లు ఉన్నతాధికారుల చేతుల్లో చీవాట్లు తిన్నా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. చీవాట్లు తప్ప కఠిన చర్యలు తీసుకునే వారు లేరన్న ధీమాతో ఆయన తిట్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

చికెన్‌ కోసం చిల్లర బుద్ధి..
ఆయన పనిచేస్తున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 15 చికెన్‌ సెంటర్లు ఉన్నాయి. రోజూ ఒక సెంటర్‌ పావుకిలో చికెన్‌ తనకు వంతుల వారీగా పంపించాలని సమావేశం పెట్టి మరీ హుకుం జారీ చేయడం గమనార్హం. ఇక ఆ స్టేషన్‌ పరిధిలో బెల్ట్‌ షాపులు, ఇసుక ట్రాక్టర్లు, వేబ్రిడ్జి కాంటాల యజమానులకు ఫోన్‌లు చేసి మామూళ్లు వసూలు చేయడంతో ఆయనకు సాటి లేరు. ఆటోడ్రైవర్లు, చిల్లర వ్యాపారులు, ఇలా ఎవరినీ వదలడు. ఆయన వసూళ్లు రూ.100 నుంచి మొదలవుతాయంటే ఎంతగా దిగజారాడో తెలిసిపోతోంది. ఖాకీ చొక్కాను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా మారాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, విషయం తెలియడంతో డీఎస్పీ సదరు స్టేషన్‌కు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. ఆ ఎస్‌ఐనుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అతనిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.

పనిచేసిన ప్రతీచోట రాసలీలలు
ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్‌ రివాల్వర్‌ను అడ్డుపెట్టుకుని రాసలీలలు చేయడంలో తనకు తనే సాటి. గతంలో పనిచేసిన మంచిర్యాల జిల్లాలో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్‌ అయిన ఘన చరిత్ర ఆయనది. తన దగ్గర పనిచేసే మహిళా సిబ్బందిని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఇబ్బందికి గురిచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘నేను అందంగా లేనా... నన్ను వద్దంటావా...? కారణం చెప్పవా.. అనే మాటలు ఆయన దగ్గర పనిచేసే మహిళా సిబ్బంది, ఫిర్యాదుదారులు ఒక్కసారైనా ఎదుర్కోవాల్సిందే. అవసరం లేకున్నా రాత్రి వరకు మహిళా సిబ్బందిని స్టేషన్‌లో ఉంచుకుని హింసపెట్టడం తన దినచర్యలో భాగం.

నేను మంత్రి మనిషిని.. 
ఆయన నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కింది సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతగాని బెదిరింపులు భరించలేక ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఏఎస్సై, ఓ హెడ్‌ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ బదిలీ చేసుకుని వెళ్లినట్లు సమాచారం. చోటామోటా నాయకులు స్టేషన్‌కు వస్తే చాలు... అందరికి వినిపించేలా ‘బాబన్న బాగుండా.. నాకు ఇంతకుముందే ఫోన్‌ చేసిండు’ అంటూ తనకు తానే డప్పు కొట్టుకోవడం కనిపిస్తుంటుంది. 

ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న రాసలీలల ఘనుడి విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో... తన కామవాంఛలను పనిచేసిన ప్రతీచోట మహిళా సిబ్బందిపై తీర్చుకుంటూ పోతున్నాడు. ఇలాంటి ఖాకీచకులపై పోలీస్‌శాఖ చర్యలు తీసుకోకుంటే మహిళలు ఆ శాఖకు రావాలంటేనే భయపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దృష్టి పెడితే ఇలాంటి ఘనుల బాగోతం వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement