భర్త వివాహేతర సంబంధం వల్లే నటి సూసైడ్!
ప్రముఖ అసోం నటి, గాయని బిదిషా బెజ్బరువా ఆత్మహత్యకు సంబంధించి తాజాగా పలు విషయాలు వెలుగుచూశాయి. ఆత్మహత్యకు ముందే బిదిషా భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. 28 ఏళ్ల బిదిషా.. నిషీత్ ఝాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ముంబై వెళ్లిన నిషీత్ వేర్వేరు కారణాలు చెప్తూ గత పన్నెండు రోజులుగా గురుగావ్ రావడానికి నిరాకరించడంతో కలత చెందిన బిదిషా బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి అశ్విని బెజ్బరువా తెలిపారు. కొన్నాళ్ల కిందట ముంబై నుంచి గురుగావ్‌కు ఈ దంపతులు తమ ఉద్యోగాలను బదిలీ చేసుకున్నారు.
గురుగావ్‌లోని సుశాంత్ అపార్ట్‌మెంటులో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల 'జగ్గాజాసూస్' సినిమాలో నటించిన బిదిషా సోమవారం సాయంత్రం తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. బిదిషాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడనే కారణంతో ఆమె భర్త నిషీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బిదిషా ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు విడాకులు ఏర్పాటుచేయమంటూ వాట్సాప్‌లో తనకు మెసేజ్ పంపిందని తండ్రి తెలిపారు. 'తన వివాహం చివరి మలుపునకు చేరిందని బిదిషా చెప్పింది. ఆమెను ఒప్పించడానికి నేను ప్రయత్నించాను. వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించమని కోరాను. కానీ నిషీత్ పట్ల తను నమ్మకం కోల్పోయిందని చెప్పింది' అని వివరించారు.
ఈ విషయాన్ని తాను నిషీత్‌కు చెప్పి.. వెంటనే బిదిషాను కలువాల్సిందిగా చెప్పినా అతను పట్టించుకోలేదని, మరింత సమయం కావాలని చెప్పాడని, ఇదే తన కూతురు బలవన్మరణానికి దారితీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో సహోద్యోగితో నిషీత్ వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నాడని, ఈ విషయం తన కూతురికి తెలిసిందని చెప్పారు. 'బిదిషా కన్నా ముందే ఆమె అతనికి తెలుసు. గత జనవరిలో ఈ విషయం బిదిషాకు తెలిసింది. దీంతో ఆమెతో సంబంధాలన్నీ తెంపుకుంటానని మాట ఇచ్చిన నిషీత్.. ఆ తర్వాత కూడా కొనసాగించాడు. జనవరి వరకు అంతా బాగానే ఉంది. కానీ నిషీత్ వివాహేతర సంబంధం గురించి బిదిషాకు తెలియడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే చివరకు నా కూతురి ఆత్మహత్యకు దారితీసింది' అని ఆయన అన్నారు.