assamese actress
-
భర్త వివాహేతర సంబంధం వల్లే నటి సూసైడ్!
ప్రముఖ అసోం నటి, గాయని బిదిషా బెజ్బరువా ఆత్మహత్యకు సంబంధించి తాజాగా పలు విషయాలు వెలుగుచూశాయి. ఆత్మహత్యకు ముందే బిదిషా భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. 28 ఏళ్ల బిదిషా.. నిషీత్ ఝాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ముంబై వెళ్లిన నిషీత్ వేర్వేరు కారణాలు చెప్తూ గత పన్నెండు రోజులుగా గురుగావ్ రావడానికి నిరాకరించడంతో కలత చెందిన బిదిషా బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి అశ్విని బెజ్బరువా తెలిపారు. కొన్నాళ్ల కిందట ముంబై నుంచి గురుగావ్‌కు ఈ దంపతులు తమ ఉద్యోగాలను బదిలీ చేసుకున్నారు. గురుగావ్‌లోని సుశాంత్ అపార్ట్మెంటులో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల 'జగ్గాజాసూస్' సినిమాలో నటించిన బిదిషా సోమవారం సాయంత్రం తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. బిదిషాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడనే కారణంతో ఆమె భర్త నిషీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బిదిషా ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు విడాకులు ఏర్పాటుచేయమంటూ వాట్సాప్‌లో తనకు మెసేజ్ పంపిందని తండ్రి తెలిపారు. 'తన వివాహం చివరి మలుపునకు చేరిందని బిదిషా చెప్పింది. ఆమెను ఒప్పించడానికి నేను ప్రయత్నించాను. వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించమని కోరాను. కానీ నిషీత్ పట్ల తను నమ్మకం కోల్పోయిందని చెప్పింది' అని వివరించారు. ఈ విషయాన్ని తాను నిషీత్కు చెప్పి.. వెంటనే బిదిషాను కలువాల్సిందిగా చెప్పినా అతను పట్టించుకోలేదని, మరింత సమయం కావాలని చెప్పాడని, ఇదే తన కూతురు బలవన్మరణానికి దారితీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో సహోద్యోగితో నిషీత్ వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నాడని, ఈ విషయం తన కూతురికి తెలిసిందని చెప్పారు. 'బిదిషా కన్నా ముందే ఆమె అతనికి తెలుసు. గత జనవరిలో ఈ విషయం బిదిషాకు తెలిసింది. దీంతో ఆమెతో సంబంధాలన్నీ తెంపుకుంటానని మాట ఇచ్చిన నిషీత్.. ఆ తర్వాత కూడా కొనసాగించాడు. జనవరి వరకు అంతా బాగానే ఉంది. కానీ నిషీత్ వివాహేతర సంబంధం గురించి బిదిషాకు తెలియడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే చివరకు నా కూతురి ఆత్మహత్యకు దారితీసింది' అని ఆయన అన్నారు. -
యువనటి బిదిశ అనుమానాస్పద మృతి
గురుగ్రామ్: తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయారు. అసామీ నటిగా పాపులర్అయిన బిదిశా.. ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోమవారం ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బిదిశా స్వస్థలం గువాహటి. చిన్నతనం నుంచే సంగీతం, నటనల పట్ల శ్రద్ధకనబర్చిన ఆమె.. టీనేజ్‌లో ఉండగానే రంగప్రవేశం చేసింది. అసామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘జగ్గా జాసూస్’ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో బిదిశా మరణవార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏడాది కిందటే.. గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝా అనే వ్యక్తితో బిదిశ వివాహం జరిగింది. అయితే, నిశీత్ కుటుంబీకులు బిదిశను వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారామె. కాగా, భర్తతో మాత్రం సత్సంబంధాలే కొనసాగుతున్నట్లు తెలిసింది. బిదిశ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు భర్తతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బిదిశది ఆత్మహత్యేనా? లేక మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.