![ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?](/styles/webp/s3/article_images/2017/09/3/71458689962_625x300.jpg.webp?itok=SqJI7LFB)
ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
- తమిళనాడులో తేలని పొత్తులు...
- అస్సాంలో ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి
- కేరళ బరిలో క్రికెటర్ శ్రీశాంత్?
చెన్నై, గౌహతి, కోల్‌కతా, తిరువనంతపురం: తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో పొత్తులపై ఇంకా సస్పెన్ష్ కొనసాగుతుండగా... బెంగాల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కేరళలో రెండు ప్రధాన కూటమిలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటుండగా...అస్సాంలో ఎన్నికల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
బీజేపీ నుంచి క్రికెటర్ శ్రీశాంత్ పోటీ!
క్రికెటర్ శ్రీశాంత్‌ను కేరళ ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బుధవారం వివరాలు వెల్లడిస్తానని శ్రీశాంత్ తెలిపారు. ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నేత ఫోన్‌లో తమను సంప్రదించారని, అమిత్ షా కేరళ వచ్చినప్పుడు శ్రీశాంత్ ఆయనను కలుస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. మరోవైపు కేరళ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున అభ్యర్థుల్ని పోటీకి పెడుతున్నట్లు జయలలిత ప్రకటించారు. పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు తమిళనాడుకు అమిత్‌షా
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం సాయంత్రం చెన్నైలో పర్యటించనున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీనియర్ ఆఫీస్ బేరర్లతో సమావేశమవుతారని పార్టీనేతలు తెలిపారు. చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి నామ్‌తమిళర్ కట్చి అభ్యర్థిగా సేలం దేవి అనే హిజ్రా పోటీ చేస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు.
బెంగాల్లోని హింసాత్మక కేంద్రాల్లో నిఘా కెమెరాలు
బెంగాల్లోని సున్నిత, హింసాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో 14 వేల సున్నిత ప్రాంతాల్ని గుర్తించామని అధికారులు మంగళవారం చెప్పారు. నిజాయతీకి మారుపేరుగా చెప్పుకుంటున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవినీతికి చిహ్నంగా మారారని బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరోపించారు. నారద స్టింగ్ ఆపరేషన్‌పై విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
అస్సాంలో ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి
అస్సాంలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ ఆధ్వర్యంలోని బృందం రెండు రోజుల పాటు అస్సాంలో పర్యటించింది. నల్లధనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా కేంద్ర బలగాల్ని సమర్ధంగా వినియోగించుకోవాలని అధికారులకు జైదీ సూచించారు. సోమవారం వరకు రూ.7.12 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమిళనాడులో మార్చి 20వ తేదీ వరకూ రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.