
వాహన కంపెనీలు లబోదిబో
న్యూఢిల్లీ: ఊహించని విధంగా ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం... ఆటోమొబైల్ కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. దీని వల్ల వడ్డీ రేట్లు పెరిగి, వాహన రుణాలు మరింత భారంగా మారతాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పండుగ సీజన్‌లోనైనా మార్కెట్ కాస్త కోలుకోగలదని ఆశిస్తుండగా ఆర్‌బీఐ నిర్ణయం నిరాశపర్చిందని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ వ్యాఖ్యానించింది. ఇది కొనుగోలుదారుల సెంటిమెంటును మరింత దెబ్బ తీస్తుందని పేర్కొంది.
ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. పండుగ సీజన్‌లో వాహనరంగానికి ఊహిం చని ఎదురుదెబ్బగా జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. రుతుపవనాలు బాగుండటంతో ఈ సీజన్‌లో అమ్మకాలు కొంతైనా మెరుగుపడతాయని ఆశించామని, ఇప్పుడు ఇది సాధ్యపడేలా కనిపించడం లేదన్నారు. ఆర్‌బీఐ నిర్ణయం వాహన పరిశ్రమ ఆశలపై నీళ్లు చల్లినట్లేనని టయోటా కిర్లోస్కర్ డిప్యుటీ ఎండీ సందీప్ సింగ్ వ్యాఖ్యానించారు.