తాజ్మహల్ పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆగ్రా: తాజ్మహల్ పై ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. రోజుకు ఐదుసార్లు తాజ్మహల్ లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని అధికార సమాజ్వాది పార్టీని మరో ముస్లిం నాయకుడు కోరారు.
ఈ వ్యాఖ్యలపై ఆగ్రా వాసులు, బుద్ధిజీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆజంఖాన్ కు మతి తప్పిందని బ్రజ్ మండల్ హెరిటేజ్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర శర్మ మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంత్రికి తగదని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు బాధాకరమని అజ్మీర్ కు చెందిన మొఘల్ చరిత్రకారుడు ఆర్. నాథ్ అన్నారు. బీజేపీ కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండించింది. ఏడాదికి 80 లక్షల మందిపైగా పర్యాటకులు తాజ్మహల్ ను సందర్శిస్తుంటారు.