యూరప్ తుడిచిపెట్టుకు పోతుందా?
సోఫియా: ఆమె వాక్కు బ్రహ్మంగారి వాక్కు. ప్రపంచ పరిణామాల గురించి ఆమె ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం పరిణామాలు నిజమయ్యాయి. అమెరికాపై రెండు లోహ విహంగాల దాడులు జరుగుతాయని, అందులో అమాయక ప్రజలు మృత్యువాత పడతారని. 2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సిరియా నుంచి ముస్లిం యుద్ధం ప్రారంభమవుతుందనీ చెప్పిన విషయం కూడా, పేట్రేగి పోతున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను చూస్తుంటే దాదాపు నిజమేనని అనిపిస్తోంది. ఈ యుద్ధం 2016 లో ముస్లిం మహా యుద్ధంగా పరిణమించి 2043 నాటికి మొత్తం ఐరోపా తుడిచిపెట్టుకు పోతుందని, ఖలిఫా రాజ్యం ఏర్పడుతుందని కూడా ఆమె భవిష్యవాణి వినిపించారు. ఇందులో ఏ మాత్రం నిజమవుతుందో రానున్న చారిత్రక పరిణామాలే తెలియజేయాలి.
ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసినదీ బల్గేరియాకు చెందిన బాబా వాంగ. ఆమె దాదాపు 20 ఏళ్ల క్రితమే, అంటే 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనావేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ఆమె అనుచర వర్గాలు చెబుతున్నాయి.
రెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగ 1989లో చెప్పడం, 2001, సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి గురించేనని ఆమె అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పడం 2004, డిసెంబర్ 26వ తేదీన ఇండోనేసియా, సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ గురించి చెప్పడమేనని ఆ వర్గాలు అంటున్నాయి. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు.
భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్ని పర్వతాలు బుసలకొడతాయని చెప్పారు.
అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగ అంచనా వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికవడం తెల్సిందే. ఆయనే ఆఖరి అధ్యక్షుడవాతారా అన్నది మిలియన్ డాలర్ల అనుమానం. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించి పోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ అంచనా వేశారు. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3,797 నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది.
బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.