
అడ్వాణీపై కుట్ర అభియోగాలు
♦ ‘బాబ్రీ’ విధ్వంసం కేసులో ఎంఎం జోషి, ఉమాభారతిలపై కూడా
♦ అనంతరం వారికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి ఎదురుదెబ్బతో పాటు, కాస్త ఊరట కూడా లభించింది. అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి సహా మొత్తం 12 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను మళ్లీ నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం. అలాగే అడ్వాణీ(89), ఎంఎం జోషి(83), ఉమాభారతి(58), బీజేపీ ఎంపీ వినయ్ కటియార్(62), వీహెచ్‌పీ నేత విష్ణు హరి దాల్మియా(89), హిందూత్వవాది సాధ్వి రితంబర(53)లకు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ బెయిలు మంజూరు చేశారు. మంగళవారం అడ్వాణీ, ఉమ సహా నిందితులంతా తమ ముందు హాజరు కావాల్సిందేనని గతంలో కోర్టు ఆదేశించడం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఈ విచారణకు అడ్వాణీ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలంతా హాజరయ్యారు. కోర్టు హాల్లో మూడు గంటల పాటు ఉన్నారు.
ఇరుపక్షాల వాదనల అనంతరం అడ్వాణీ సహా ఆరుగురు నేతలకు బెయిల్ మంజూరు చేసింది. కుట్ర అభియోగాలను మోపవద్దంటూ నిందితుల తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాగా, కోర్టుకు వెళ్లేముందు అడ్వాణీని యూపీ సీఎం ఆదిత్యనాథ్ వీఐపీ గెస్ట్‌హౌజ్‌లో కలిశారు. మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు గతనెలలో కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది. అందులో భాగంగా బీజేపీ నేతలపై కుట్రపూరిత అభియోగాలను నమోదు చేయడంపై లక్నోలోని సీబీఐ కోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ఎవరూ ఆపలేరు: సాక్షి మహరాజ్
బాబ్రీ మసీదు విధ్వంసంలో కుట్ర ఏమీ లేదని, అదిబహిరంగ ఉద్యమంలా జరిగిందని కోర్టుకు హాజరయ్యేముందు ఉమ అన్నారు. ‘ఆ రోజు నేనక్కడే ఉన్నాను. నేనే కాదు లక్షలాది కార్యకర్తలు, రాజకీయ నేతలు అందులో పాలుపంచుకున్నారు’ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లింలూ అనుకూలంగా ఉన్నారన్నారు.
అభియోగాలివీ...
నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు మంగళవారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు.