
హల్ చల్ చేస్తున్న 'బాహుబలి' బర్రె!
'బాహుబలి' సినిమాలో భారీ (గ్రాఫిక్) దున్నపోతుతో భల్లాలదేవ పోరాడే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ భారీ దున్నపోతును తలదన్నేస్థాయిలో ఉండే దున్నపోతు ఒకటి ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణంలో హల్ చల్ చేస్తోంది.
1500 కిలోల బరువుతో, భారీ ఆకారంతో ఉన్న దున్నపోతుకు ముద్దుగా 'బాహుబలి' బర్రె అని పేరు పెట్టారు. ఈద్ ఉల్ ఆధా (బక్రీద్) పండుగ సందర్భంగా ఈ దున్నపోతు స్థానికంగా స్పెషల్ ఆట్రాక్షన్ గా మారింది. పంజాబ్ లోని లూథియానా నుంచి ఈ దున్నపోతును రూ. 11 లక్షలకు మహమ్మద్ తౌఫీక్ ఖురేషి, నదీం అనే వ్యక్తులు కొనుగోలు చేశారు. బక్రీద్ సందర్భంగా అంతకంటే ఎక్కువ ధరకే ఇది అమ్ముడుపోతుందని వారు భావిస్తున్నారు. ఒకవేళ అమ్ముడుపోకపోతే తామే బలి ఇయ్యాలని నిర్ణయించారు.
ముర్రా జాతికి చెందిన ఈ భారీ దున్నపోతు స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఈ 'బాహుబలి'ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం వచ్చి దీనిని తిలకించి మురిసిపోతున్నారు.