రూ.2లక్షల ఆంక్షలపై క్లారిటీ
న్యూఢిల్లీ: నగదు లావాదేవీల పై ఖాతాదారులకు షాకిచ్చిన కేంద్రం కొంత ఊరట నిచ్చింది. రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీల ఆంక్షలపై వివరణ ఇచ్చింది. ఐటీ చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్ ప్రకారం బ్యాంకులకు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు , కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాల నగదు ఉపసంహరణలకు ఈ నిబంధన వర్తించదని ఆదాయపు పన్ను శాఖ గురువారం తెలిపింది. ఈ విషయంలో అవసరమైన నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పింది.
ఫైనాన్స్ బిల్లు 2017లో నగదు లావాదేవీలపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ పరిమితులు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, కోఆపరేటివ్ బ్యాంక్ సేవింగ్ ఖాతాలకు వర్తించవని స్పష్టం చేసింది. కొత్తగా జోడించిన ఐటీ యాక్ట్ 269ఎస్‌టి ప్రకారం రూ.2లక్షలకు పైన నగదు ఉపసంహరణలపై బ్యాన్ ఈ ఖాతాలకు వర్తించదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అలాగే నగదు ఉపసంహరణలపై పరిమితులు వీరికి వర్తించవని ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా నగదు లావాదేవీలను రూ. 2 లక్షలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. 2017-18 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రు .3 లక్షల నగదు లావాదేవీ నిషేధించాలని ప్రతిపాదించారు. అయితే గత నెల లోక్సభ ఆమోదించిన ఆర్థిక బిల్లు సవరణ ద్వారా ఈ పరిమితిని రూ 2 లక్షల వరకు కుదించారు. రెండు లక్షలకు మించి నగదు లావాదేవీ జరిపితే 100శాతం జరిమానా కట్టవలసి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.