బార్కాస్‌లోని ఎస్‌బీఐ శాఖ వద్ద బారులు తీరిన జనం
పచ్చనోటు ‘రద్దు’.. నగరవాసికి పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. పదిరోజులు గడుస్తున్నా ‘కొత్తనోటు’ చేతికి అందక ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకుల వద్ద కిలోమీటర్ల పొడవున జనం బారులు.. ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దే అవే క్యూలు. ఏది కొనాలన్నా తడుముకునే పరిస్థితి. వంటింట్లోని డబ్బాలు వెదికినా పదిరూపాయలు కూడా దొరకడం లేదు. మార్కెట్లు కుప్పకూలిపోయారుు. కూలీలకు పని దొరకని దుస్థితి. కోట్ల ఆస్తులున్నా రూ.2 వేల కొత్త నోట్లు కోసం అవస్థలు పడాల్సివస్తోంది.
గురువారం కూడా నగరవ్యాప్తంగా ఇదే దుస్థితి. రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాధారణ రోజుల్లో రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరిగే గుడిమల్కాపూర్ మార్కెట్‌లో గురువారం రూ.2 కోట్ల మేరకే వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం, కూరగాయలు, హోల్‌సేల్, నిత్యావసరాలు.. ప్రతి మార్కెట్ ‘నోటు’ దెబ్బకు విలవిల్లాడుతున్నారుు. - సాక్షి,సిటీబ్యూరో