
ప్రేమ సందేశాలు పంపి దొరికిపోయిన దొంగ
బెంగళూరు: యథేచ్ఛగా దొంగతనాలు సాగిస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఓ దొంగల ముఠాను పట్టించింది మిస్డ్ కాల్. కృష్ణరాజపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజీయరాయప్ప తెలిపిన మేరకు... కొన్ని నెలల క్రితం కృష్ణరాజపురంలోని ఓ ఇంటిలోకి తౌసిఫ్(24), అతని అనుచరులు హుడి నివాసి అహమ్మద్ నవాజ్, నాయండనహళ్లి నివాసి నాగరాజు, మారతహళ్లికి చెందిన షఫి చొరబడి విలువైన మొబైల్, ల్యాప్‌టాప్‌ను చోరీ చేశారు.
సంఘటనకు సంబంధించి అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు మొబైల్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చోరీ అయిన మొబైల్ నుంచి ఓ అమ్మాయికి ప్రేమ సందేశాలు వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు, హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. అక్కడున్న ఆమెను చూసి అవాక్కయ్యారు. ప్రేమ సందేశాలు అందుకుంటున్నది యువతి కాదని, 45 సంవత్సరాల, ఇద్దరు బిడ్డల తల్లి అని గుర్తించారు. విచారణ చేయగా, తన కుమారుడు పొరబాటున రాంగ్ నంబర్‌కు కాల్ చేశాడని, అప్పటి నుంచి నిత్యం ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె తెలిపింది. దీంతో నిందితుడి అరెస్ట్‌కు సహకరించాలని కోరుతూ ఆమె ద్వారానే అతడికి ఫోన్ చేయించారు.
ఇక ఎస్‌ఎంఎస్‌లు పంపింది చాలని, తాను కలవాలని అనుకుంటున్నానని, నగరంలోని ప్రఖ్యాతి గాంచిన మాల్ పేరు చెప్పి అక్కడకు రావాలని కోరింది. ఆ మేరకు రెండ్రోజుల క్రితం బురఖా వేసుకుని ఆమె మాల్ వద్దకు చేరుకుంది. ఆమెను మఫ్టీలో సీఐ సంజీయరాయప్ప, సిబ్బంది అనుసరించారు. మాల్‌లో తౌసిఫ్ కలిసి మాట్లాడుతుండగా నిర్ధారించుకున్న అనంతరం ఆమె సూచన మేరకు సీఐ అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నాడు. అతడు తెలిపిన మేరకు అనుచరులు అహ్మద్ నవాజ్, నాగరాజు, షఫీని అరెస్ట్ చేశారు. వీరి నుంచి పలు చోరీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.