ఢాకా: బంగ్లాదేశ్‌లో నాలుగేళ్ల కిందట సైనిక తిరుగుబాటు, 74 మంది ఊచకోత కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 152 మంది బంగ్లాదేశ్ మాజీ సైనికులకు ఉరిశిక్ష విధించింది. 34 నెలల విచారణ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మహమ్మద్ మంగళవారం ఈ తీర్పు వెలువరించారు. ఉరిశిక్ష పడినవారిలో.. తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన బంగ్లాదేశ్ రైఫిల్స్ మాజీ డిప్యూటీ అసిస్టెంట్ డెరైక్టర్ తౌహిద్ అహ్మద్‌తోపాటు పలువురు మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు.
ఈ కేసులో మొత్తం 820 మాజీ సైనికులు, 26 మంది పౌరులపై విచారణ కొనసాగింది. వీరిలో కోర్టు 152 మంది తిరుగుబాటు సైనికులకు ఉరిశిక్ష విధించగా, 158 మంది మాజీ సైనికులకు జీవిత ఖైదు చేసింది. 251 మందికి 3 నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించి, 271 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని దోషుల న్యాయవాదులు తెలిపారు. వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై 2009 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో వందలమంది సైనికులు ఉన్నతాధికారులపై తిరుగుబాటు చేశారు. ఢాకాలోని సైనిక ప్రధాన కార్యాలయంలో మారణకాండ సృష్టించారు. అప్పటి బంగ్లా రైఫిల్స్ అధినేత షకీల్ అహ్మద్‌ను మట్టుబెట్టారు.
152 మంది మాజీ సైనికులకు ఉరిశిక్ష
Published Wed, Nov 6 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement