
కలసి తాగుదాం రా..!
మద్యానికి బానిసైన భర్తలో మార్పు తేవాలని అనుకుంది ఆమె. భర్త ఏ బార్‌లో మందు తాగుతాడో తెలుసుకుని అతని కంటే ముందే అక్కడికెళ్లింది.
* టాస్మాక్ బారులో భర్తను పిలిచిన భార్య
* పోలీస్ సమక్షంలో హితవు
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యానికి బానిసైన భర్తలో మార్పు తేవాలని అనుకుంది ఆమె. భర్త ఏ బార్‌లో మందు తాగుతాడో తెలుసుకుని అతని కంటే ముందే అక్కడికెళ్లింది. భర్త రాగానే ‘ఇద్దరం కలిసి తాగుదాం రా..’ అని పిలవడంతో అతనితో పాటు అక్కడున్న మందుబాబులు అవాక్కయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
కేఆర్‌జీ నగర్‌కు చెందిన జయకుమార్, విల్లి భార్యాభర్తలు. ప్రయివేటు కంపెనీలో పనిచేసే జయకుమార్ రోజూ ఫూటుగా మద్యం తాగి ఇంటి కి వచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇంటి ఖర్చులకు సైతం ఇవ్వకుండా జీతం మొత్తాన్ని మద్యానికే తగలేస్తుండడంతో విసిగి పోయినన విల్లి మూడురోజుల పాటు భర్తకు తెలియకుండా రోడ్డులో అతన్ని అనుసరించింది. ఏ బార్ లో మద్యం తాగుతున్నాడో తెలుసుకుంది. బుధవారం భర్త కంటే ముందుగా టాస్మాక్ బార్ (ఆబ్కారీ శాఖ నిర్వహించే బార్)కు వెళ్లి మందుబాబుల నడుమ కూర్చుంది.
మందుబాబులు, టాస్మాక్ నిర్వాహకులు ఇక్క డి నుంచి వెళ్లిపోవాలని ఆమెను కోరినా పట్టించుకోలేదు. ‘నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి తాగుతాం’ అనటంతో వారు మిన్నకుండిపోయారు. కొద్దిసేపట్లో బార్‌కు వచ్చిన జయకుమార్ భార్యను చూసి బిత్తరపోయాడు. ‘ఎందుకు వచ్చావ్, వెళ్లిపో’ అంటూ గదమాయించాడు. ‘ఇద్దరం కలిసి తాగుదాం, నాకూఆర్డర్ ఇవ్వు’ అని ఆమె అనటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు పోలీసుల సమక్షంలో జయకుమార్ చేత ‘ఇకపై తాగను’ అంటూ వాగ్దానం చే యించాక ఆమె శాంతించింది. ఇకపై తన భర్త మద్యం తాగేందుకు బార్‌కు వస్తే ఇక్కడే ధర్నా చేస్తానని విల్లి తెలిపింది.