క్షేత్రస్థాయికి వెళ్లాలని కమిషనర్‌కు వైద్య శాఖ మంత్రి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: డెంగీ జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. బాధితులను ఆస్పత్రుల్లో చేర్పించాలని ఆయన వైద్య సిబ్బందికి చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీలో పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయా జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు గ్రామాలే డెంగీ బారిన పడినట్లు వారలొచ్చాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏరియా ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, కిట్లు, ఇతరత్రా నిర్వహణ కోసం ఒక్కో ఆసుపత్రికి రూ. 30 లక్షల చొప్పున రూ. 10.20 కోట్లు గురువారం విడుదల చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా త్వరలో 12 ప్లేట్‌లెట్లను లెక్కించే యంత్రాలను కూడా సరఫరా చేయనున్నారు. వీటి సరఫరాకు సంబంధించి ఇప్పటివరకు నెలకొన్న వివాదం పరిష్కారమైనందున అవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. జ్వరాలతో బాధపడే ప్రజలను ఆగమేఘాల మీద ఏరియా ఆసుపత్రులకు తీసుకొచ్చి అందుబాటులో ఉన్న నిర్ధారణ పరీక్షలతో ప్రజలను ఆదుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. డెంగీ రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.