రెండేళ్ల క్రితం అటు వార్తా పత్రికల్లో ఇటు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసిన ఐస్ బకెట్ ఛాలెంజ్ గుర్తుందా? సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరకూ బకెట్ల కొద్దీ మంచునీళ్లను తలపై గుమ్మరించుకుని ఓ అరుదైన వ్యాధి చికిత్సకు తమ వంతు సాయమందించిన సందర్భం అది. కేవలం 30 రోజుల్లో పది కోట్ల డాలర్లు సేకరించిన తర్వాత ఈ పోటీపై మాట్లాడుకున్నవారే లేకుండాపోయారు.
అయితే ఈ పోటీ నిర్వాహకుల ప్రయత్నాల పుణ్యమా అని ఈ రెండేళ్లలో ఏఎల్‌ఎస్ వ్యాధి చికిత్సలో మెరుగైన పురోగతి వచ్చింది. ఐస్‌బకెట్ ఛాలెంజ్ ద్వారా సేకరించిన మొత్తంతో ఏఎల్‌ఎస్ అసోసియేషన్ ‘ప్రాజెక్ట్ మిన్‌ఈ’ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏఎల్‌ఎస్ వ్యాధి బాధితులైన దాదాపు 15 వేల మంది జన్యుక్రమాలను విశ్లేషించారు. దీనిద్వారా వంశపారంపర్యంగా లేదా కొన్ని తెలియని కారణాలతో వచ్చే ఈ నాడీ సంబంధిత వ్యాధికి ఒక జన్యువు కారణమని తెలిసింది. ఎన్‌ఈకే1 అని పిలుస్తున్న ఈ జన్యువును గుర్తించడం వల్ల ఏఎల్‌ఎస్‌కు త్వరలోనే చికిత్స కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.