భద్రాద్రి రామయ్య సీమాంధ్రకే! | bhadrachalam belongs to seemandhra region | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రామయ్య సీమాంధ్రకే!

Published Fri, Feb 7 2014 1:12 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

జీవోఎం భేటీ అనంతరం బయటకు వస్తున్న షిండే, జైరాం - Sakshi

జీవోఎం భేటీ అనంతరం బయటకు వస్తున్న షిండే, జైరాం

* భారీ ఆర్థిక ప్యాకేజీ కూడా  
* తుది బిల్లులో ఈ రెండింటికీ చోటు?
* 134 పోలవరం ముంపు గ్రామాలు కూడా సీమాంధ్రకే
* కీలక సవరణలు ప్రతిపాదించిన జీవోఎం
* తెలంగాణే ఎజెండాగా నేటి సాయంత్రం కేబినెట్ ప్రత్యేక భేటీ
* సవరణలపై నిర్ణయం.. తుది బిల్లుకు ఆమోదం!
* పని ముగిసిందన్న జీవోఎం.. ఈ సమావేశాల్లోనే బిల్లు: షిండే
* అనంతరం సవరణలపై ప్రధాని, సోనియాలతో మంతనాలు
* వెంకయ్య నివాసంలో బీజేపీ నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన జైరాం
* గురువారం నాటి కేబినెట్‌లో ప్రస్తావనకు రాని తెలంగాణ
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు తుది ఘట్టంలో హస్తిన వేదికగా నెలకొన్న ఉత్కంఠ ఎడతెగకుండా కొనసాగుతోంది. అయితే ముసాయిదా బిల్లుకు సవరణలు జరగడం మాత్రం దాదాపుగా ఖాయమైంది. సీమాంధ్ర కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) బుధవారం ప్రత్యేకంగా సవరణ ప్రతిపాదనలు స్వీకరించడం తెలిసిందే. అంతేగాక... తమ పని ముగిసిందని గురువారం మధ్యాహ్నం జీవోఎం ప్రకటించిన అనంతరం, రాత్రి సమయంలో బృందంలోని కీలక సభ్యుడు జైరాం రమేశ్ స్వయంగా బీజేపీ అగ్ర నేత వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి మరీ సవరణల ప్రతిపాదనలను స్వీకరించారు!

విభజన బిల్లు పార్లమెంటులో గట్టెక్కాలంటే బీజేపీ మద్దతు కీలకమైనందున ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వెంకయ్య సమక్షంలో బీజేపీ సీమాంధ్ర నేతలతో జైరాం గంట పాటు సమావేశమయ్యారు. వారు ఆయనకు 13 సవరణ ప్రతిపాదనలు అందజేశారు. ముసాయిదా బిల్లుకు కీలక సవరణలుంటాయని ఈ పరిణామాలతో తేటతెల్లమైంది. ఇటు బీజేపీ, అటు సీమాంధ్ర మంత్రులు డిమాండ్ చేస్తున్న మేరకు భద్రాచలం డివిజన్‌ను, 134 పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం పచ్చజెండా ఊపడం ఖాయమంటున్నారు. దాంతోపాటు సీమాంధ్రకు, ముఖ్యంగా వెనకబడ్డ రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కూడా తుది బిల్లులో చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది.

గురువారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో విభజన బిల్లుపై చర్చే ఏకైక అజెండాగా కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం 4.30కు ప్రత్యేకంగా సమావేశం కానుంది. బిల్లుకు ఈ భేటీలోనే ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. జీవోఎం వరుసగా రెండో రోజు గురువారం మధ్యాహ్నం ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమావేశమై, పలు కీలక సవరణలను చేరుస్తూ బిల్లుకు తుది రూపునిచ్చింది.

భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపడం, సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీతో పాటు కొత్త రాజధానికి ఆర్థిక సాయం, ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం వంటివి వీటిలో కీలకంగా ఉన్నాయి. అన్ని ప్రతిపాదనల మీదా శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ పరిగణనలోకి తీసుకోకపోవచ్చంటున్నారు. తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ఆస్కారముండటం, బీజేపీతో పాటు ఎంఐఎం కూడా దాన్ని వ్యతిరేకిస్తుండటం ఇందుకు కారణంగా కన్పిస్తోంది.

ఇదే చివరి భేటీ!
గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు జరిగిన జీవోఎం భేటీలో చైర్మన్ సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, నారాయణ సామి పాల్గొన్నారు. అనంతరం నారాయణ సామి మీడియాతో మాట్లాడారు. జీవోఎం సమావేశం ముగిసిందని, ఇదే తుది సమావేశమని పేర్కొన్నారు. గురువారం నాటి కేబినెట్ భేటీలో తెలంగాణ అంశం లేదని మొయిలీ చెప్పారు (అప్పటికింకా కేబినెట్ భేటీ అవలేదు). తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడొస్తుందన్న మీడియా ప్రశ్నకు, ‘ఈ సెషన్ చివర్లో’ అని షిండే బదులిచ్చారు. అనంతరం షిండే, జైరాం నేరుగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి తుది సిఫార్సులను ఆయనకు వివరించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యారు.

సీమాంధ్రకు, ముఖ్యంగా వెనకబడ్డ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని జీవోఎం సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ ఎంత ఉండాలన్న అంశంపై ప్రస్తుతం అంచనాలు లేకపోవడం, తగిన సమయమూ లేనందున.. ప్యాకేజీ ఎంతివ్వాలనే అంశంపై బిల్లు ఆమోదం పొందిన వెంటనే 14వ ఆర్థిక సంఘం అంచనాలు తయారు చేస్తుంది. అందుకు అనుగుణంగా కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని సమాచారం. అలాగే కొత్త రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం ఇతోధికంగా సాయం చేయాలని, అందుకవసరమైన నిధులను కూడా బిల్లులో చేర్చాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం దాన్ని యూటీ చేయాలనే ప్రతిపాదనను కూడా కేబినెట్ ముందుంచినట్టు తెలుస్తోంది.
 
హైదరాబాద్ ఆదాయంపై కమిటీ!
హైదరాబాద్ ఆదాయ పంపిణీపై నెల రోజుల్లో కమిటీ వేసే యోచన కూడా ఉన్నట్టు సమాచారం. అయితే హైదరాబాద్ యూటీతో పాటు ఆదాయ, వ్యయాల పంపిణీపై కమిటీ ఏర్పాటును తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందజేసినా అభ్యంతరం లేదు గానీ తెలంగాణ విషయంలో షరతులు విధిస్తే మాత్రం రాజకీయంగా ఇబ్బందేనని ఆ ప్రాంత నేతలంటున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే కేబినెట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. విభజన బిల్లు విషయంలో కేబినెట్ మంత్రులు కూడా మరిన్ని సూచనలు చేసే అవకాశాలున్నాయి. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు సవరణల ప్రక్రియ కొనసాగించనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement