
ఆప్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
మరో ఆప్ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ కు సంబంధించిన సున్నితమైన అంశాలను సోషల్ మీడియాలో వీడియో తో షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్.. తనపై వచ్చిన విమర్శలకు స్పందించారు.
న్యూఢిల్లీ: మరో ఆప్ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ కు సంబంధించిన సున్నితమైన అంశాలను సోషల్ మీడియాలో వీడియో తో షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్.. తనపై వచ్చిన విమర్శలకు స్పందించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్లమెంట్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తాను ఉంచిన వీడియో పార్లమెంటు భద్రతకు విరుద్ధంగా ఉందనే ప్రశ్నకు సమాధానంగా... నిజంగా పార్లమెంటు భద్రతకు విరుద్ధంగా తాను ప్రవర్తించానా? అని ఎదురుప్రశ్న వేశారు.
కాగా పార్లమెంట్లోని భద్రతా ఏర్పాట్లను రహస్య కెమెరాతో రికార్డు చేసిన ఆప్ ఎంపీ వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పెడతానని భగవంత్ మాన్ అన్నారు. అంతేకాకుండా తనకు నోటీసులు ఇవ్వండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆప్పై బీజేపీ విరుచుకుపడింది. దేశ భద్రతను ఆప్ తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తింది.