విశాల్‌కు బీజేపీ వల
దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ కోసం భారతీయ జనతా పార్టీ వల విసిరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. క్రికెటర్ శ్రీకాంత్ ఇందుకు సంబంధించి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
* క్రికెటర్ శ్రీకాంత్ సిఫార్సు
* వచ్చేనెల ప్రధాని మోదీ, అమిత్‌షా రాక
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అనేక పార్టీల్లో సినీ గ్లామర్ పరిపాటిగా మారింది. అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకేల్లో కోలీవుడ్ కళకు కొదువేలేదు. మూడు పార్టీల తరఫున నటీనటులు ప్రచారం చేయనున్నారు. అన్నిపార్టీలకు దీటుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను రంగంలోకి దించాలని బీజేపీ భారీ ప్రయత్నాలే చేసింది.
తాజా పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలిపేందుకు సిద్ధమని రజనీకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఏకంగా రజనీ ఇంటికే వెళ్లారు. పార్టీ నేతలు అనేకసార్లు కలిశారు. ఎన్నిచేసినా తాను ఎన్నికలకు, రాజకీయాలకు దూరమని నర్మగర్భంగా రజనీ చెబుతూనే ఉన్నారు.
విశాల్ కోసం యత్నం
ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీస్టార్‌గా వెలుగొందుతున్న విశాల్‌ను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చెన్నైవాసుడైన క్రికెటర్ శ్రీకాంత్ విశాల్ కోసం గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత మురళీధరరావుతో శ్రీకాంత్ సంప్రదింపులు జరిపారు. మైలాపూరు నియోజకవర్గం నుంచి విశాల్‌ను పోటీకి పెట్టాలని శ్రీకాంత్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీకి సీనియర్ నటీనటులు విసు, నటి వైజయంతీమాల తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అలాగే విశాల్‌ను సైతం ఎన్నికల బరిలో దించాలని బీజేపీ సైతం భావిస్తోంది. నడిగర్ సంఘం భవన నిర్మాణంలో తలమునకలై ఉన్నందున మరో ఆరునెలలు విరామం లేదని విశాల్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం విశాల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
వచ్చేనెల మోదీ, అమిత్‌షా పర్యటన
జార్జికోటపై జెండా పాతేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కదలివస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా త్వరలో తమిళనాడుకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీ కూటమి కోసం రాష్ట్ర నేతలు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో తమతో కలిసి నడిచారన్న నమ్మకంతో డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలను అనేకసార్లు ఆహ్వానించారు.
అలాగే మరోవైపు అన్నాడీఎంకే నుంచి అమ్మ పిలుపు కోసం ఆశగా ఎదురుచూశారు. ఆఖరుకు కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ సైతం రంగంలోకి దిగారు. అయితే ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. పొత్తు చర్చలతో నిమిత్తం లేకుండా బీజేపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను నిలపాలని అధిష్టానం ఆదేశించింది. ఎవ్వరూ ఊహించని రీతిలో 234 నియోజకవర్గాలకు మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒంటరిపోరా లేక మరేదైనా పార్టీలు ముందుకు వస్తాయా అని బీజేపీ సందిగ్ధంలో ఉంది. పార్టీలోని ఎక్కువ శాతం మంది ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఒంటరిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ బలమేంటో తేటతెల్లం కాగలదని పార్టీశ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయాలను పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లడంతో మోదీ, అమిత్‌షా స్వయంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. అగ్రనేతలు వచ్చేలోగా పార్టీ మేనిఫెస్టోను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలలో మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి.