
భెల్ నికర లాభం రూ. 695 కోట్లు
విద్యుత్ పరికరాల దిగ్గజం బీహెచ్‌ఈఎల్ క్యూ3లో రూ. 695 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది.
న్యూఢిల్లీ: విద్యుత్ పరికరాల దిగ్గజం బీహెచ్‌ఈఎల్ క్యూ3లో రూ. 695 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,182 కోట్లతో పోలిస్తే ఇది 41% క్షీణత. వెరసి వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ లాభాల్లో క్షీణత నమోదైంది. కొత్త ఆర్డర్ల రాకలో మందగమనం, కస్టమర్ల నుంచి రావాల్సిన చెల్లింపులు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీశాయి.
ఇదే కాలానికి కంపెనీ ఆదాయం కూడా 15%పైగా తగ్గి రూ. 8,926 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ3లో రూ. 10,552 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే గతేడాది క్యూ3లో బీహెచ్‌పీవీను విలీనం చేసుకున్న కారణంగా గత ఫలితాలను పోల్చి చూడలేమని కంపెనీ పేర్కొంది. వాటాదారులకు షేరుకి రూ. 1.31 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది. వెరసి డివిడెండ్‌కింద ప్రభుత్వానికి రూ. 217 కోట్లు లభించనున్నాయి. డివిడెండ్‌ను ఈ నెల 10న(రికార్డు తేదీ) చెల్లించనున్నట్లు తెలిపింది.
విద్యుత్ విభాగం డల్
విద్యుత్ విభాగం నుంచి ఆదాయం 12% క్షీణించి రూ. 7,320 కోట్లకు పరిమితమైంది. పారిశ్రామిక విభాగం నుంచి కూడా 28% తక్కువగా రూ. 1,599 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. డిసెంబర్ చివరికి కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ రూ. 1,00,600 కోట్లుగా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర 1.7% నష్టంతో రూ. 161 వద్ద ముగిసింది.