బిహార్‌లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
లఖీసరాయ్/పట్నా: బిహార్‌లో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లఖీసరాయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై విచారించడానికి బిహార్ ప్రభుత్వం సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితుల్లో ఇద్దరిని గుర్తించిన పోలీసులు ఆదివారం ఒకరిని అరెస్టు చేశారు. అతను మైనర్ కావడంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. బాలిక శుక్రవారం రాత్రి బహిర్భూమికి బయటకు వెళ్లినప్పుడు నిందితులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం దగ్గరలోని బన్షీపూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి బలవంతంగా రైలు ఎక్కించారు. అనంతరం కదులుతున్న రైలు నుంచే ఆమెను క్యూల్ స్టేషన్ వద్ద బయటకు తోసేశారు. ఆమెకు నడుము భాగంలో ఫ్రాక్చర్ అయ్యిందనీ, బాగా రక్తం పోయిందనీ వైద్యులు తెలిపారు.