
మందులు వేసుకోలేదని.. భార్యను చంపేశాడు!
భార్య మీద అతి ప్రేమతో ఆమెను చంపేశాడో భర్త!! ఓవైపు జబ్బుతో బాధపడుతున్నా.. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోలేదన్న కోపంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన బీహార్లోని బక్సర్ జిల్లాలో జరిగింది. సల్మా ఖాతూన్ (26) అనే మహిళను ఆమె భర్త మహ్మద్ ముస్తఫా అబ్బాసీ పదునైన ఆయుధంతో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. సల్మా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, డాక్టర్లు ఆమెకు మందులు ఇచ్చినా, వాటిని ఆమె సరిగా వేసుకోవట్లేదని బ్రహంపూర్ పోలీసు స్టేషన్ అధికారి గోరఖ్ రాం చెప్పారు.
ఎన్ని సార్లు చెప్పినా ఆమె మాట వినిపించుకోకపోవడం, మందులు వేసుకోకపోవడంతో కోపం వచ్చిన ఆమె భర్త.. ఏదో పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఆమె ఆరోగ్యం బాగుపడాలని, త్వరగా కోలుకోవాలని సమీపంలో ఉన్న ఓ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశాడు. వెంటనే వైద్యం అందకపోవడంతో ఆమె మరణించింది. అబ్బాసీని పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు.