హ్యాట్రిక్‌పై కాంగ్రెస్ ధీమా
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో కేంద్రంలో అధికారాన్ని మార్చేందుకు ప్రజలకు సమయం వచ్చిందని బీజేపీ పేర్కొంది. ఎన్నికల ప్రకటన నేపథ్యంలో... ఢిల్లీలో బుధవారం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అధికార ప్రతినిధులు సుధాంశు త్రివేది, ముక్తార్ అబ్బాస్ నక్వీ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు బీజేపీ ముందునుంచే సిద్ధంగా ఉందని చెప్పారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోందని, తాము పూర్తి మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
పరువు కాపాడుకోవడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు, రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకోవడానికి మూడో ఫ్రంట్ పార్టీలు, స్థాయిని నిలుపుకోవడానికి మరి కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని... కేవలం బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటుకు మైదానంలో ఉందని సుధాంశు త్రివేది అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కాంగ్రెస్ అవినీతి, ఆర్డినెన్సు కంపెనీకి తాళం పడిందని... కాంగ్రెస్ అవినీతి, ధరల పెరుగుదల, దుష్టపాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారని నక్వీ అన్నారు. ఎన్నికల్లో సరైన ఎంపిక చేసుకోవాలని ప్రజలకు నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను గెలిపించాలంటూ ట్విట్టర్‌లో సందేశాలు పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దారుణ పరాజయం తప్పదని ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు.
మూడోసారీ అధికారం మాదే: కాంగ్రెస్
దేశంలో మూడోసారీ అధికారం తమదేనని, కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ప్రజలందరూ సమానత్వాన్ని పొందుతారని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. 2004, 2009 ఎన్నికల్లోనూ బీజేపీకి అనుకూలంగా సర్వేలు వచ్చాయని, ఈ సారీ బీజేపీకి అనుకూలంగా సర్వేలు వచ్చాయని.. కానీ, కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని చెప్పారు. మీడియాలో ప్రచారం చేసుకొని తాము గెలుస్తామని బీజేపీ భావిస్తోందని దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు.
అనవసర వ్యయం పెరుగుతోంది: ఏచూరి
తొమ్మిది విడతల్లో సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ వల్ల దేశంలో అనవసర వ్యయం పెరిగిపోతుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ప్రజలకు, పార్టీలకు ఇబ్బందికరమన్నారు.
అధికార మార్పు తప్పదు: బీజేపీ జోస్యం
Published Thu, Mar 6 2014 4:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement