మినీ భారత యుద్ధం! | Mini Indian War | Sakshi
Sakshi News home page

మినీ భారత యుద్ధం!

Published Thu, Jan 5 2017 2:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మినీ భారత యుద్ధం! - Sakshi

మినీ భారత యుద్ధం!

సెమీ ఫైనల్స్‌గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు 
బీజేపీకి ప్రతిష్టాత్మకం
‘నోట్ల రద్దు’పై రిఫరెండం అవుతుందా?     
యూపీలో మోదీ హవా కొనసాగుతుందా?
ఆప్‌ పంజాబ్‌కు కూడా విస్తరిస్తుందా?    
మణిపూర్‌లో కమలం వికసిస్తుందా?

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కారు రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 543 లోక్‌సభ సీట్లలో దాదాపు ఐదో వంతు(102 లోక్‌సభ స్థానాలు) ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కాబట్టి.. మరో రెండేళ్ల తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు. దేశ ప్రజలను ఇబ్బంది పెట్టిన మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన ఫలితాలనివ్వలేదన్న విశ్లేషణల నేపథ్యంలో.. ఈ ఎన్నికలు నోట్ల రద్దుపై ‘రిఫరెండం’గా మారతాయా అన్న ఆసక్తీ నెలకొంది. యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సంక్షోభం, పంజాబ్, గోవాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) రంగంలోకి దిగడం, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ సర్కారు ఒడిదుడుకులు కొనసాగుతుండటం, మణిపూర్‌లో సైతం కమలం వికసిస్తుందన్న అంచనాలు.. ఈ ఎన్నికలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

మోదీకి ఇది అగ్నిపరీక్ష..!
కేంద్రంలోని మోదీ సర్కారుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. గత రెండేళ్లలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కీలకమైన ఢిల్లీ, బిహార్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓడింది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాల్సిన రాష్ట్రం యూపీ! మోదీ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ.. మొత్తం 80 లోక్‌సభ సీట్లతో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడ 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాతో బీజేపీకి 71 సీట్లు వచ్చాయి. 42.3 శాతం ఓట్లతో 89 శాతం సీట్లు దక్కాయి. ఇంత భారీ ఆధిక్యం సాధించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకలా ఉండాలి. ఎస్పీ సంక్షోభమూ కలిసి రావాలి. అయితే పెద్ద నోట్ల రద్దు బీజేపీ విజయావకాశాలను సందేహాస్పదం చేస్తోంది. ఐదేళ్ల కిందట అధికారం కోల్పోయిన బీఎస్పీ పరిస్థితి ఎలా ఉంటుందన్నదీ చూడాల్సిందే.

పంజాబ్‌లో సరికొత్త పోరు..
పంజాబ్‌లో పదేళ్లుగా కొనసాగుతున్న శిరోమణి అకాలీదళ్‌–బీజేపీ సంకీర్ణ సర్కారుపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆప్‌ కొత్తగా బరిలోకి దిగి గత లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ ఎలానూ ఉంది. దీంతో ఏ పార్టీ గెలుస్తుందన్న అన్న ఉత్కంఠ నెలకొంది.

గోవాలో ముక్కోణ పోటీ..
బీజేపీ పాలనలోని గోవాలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆప్‌ రంగంలోకి దిగడంతో ముక్కోణ పోటీ ఉంది. ప్రస్తుత బీజేపీ సర్కారుపై వ్యతిరేకత ఉంటే.. కాంగ్రెస్, ఆప్‌లలో దేనివైపు జనం మొగ్గుతారనేది ఆసక్తికరం.

మణిపూర్‌ ఎన్నికలపై ‘నాగా’ ప్రభావం?
మణిపూర్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. గత ఏడాది జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తొలిసారిగా ఈశాన్యంలో సర్కారును ఏర్పాటు చేసింది. ఇప్పుడు మణిపూర్‌లోనూ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని పరిశీలకుల అంచనా. అయితే నాగా తీవ్రవాదులు, వారితో శాంతి చర్చల్లో కేంద్ర వైఖరి తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.  

ఉత్తరాఖండ్‌లో సర్కారు మళ్లీ మారుతుందా?
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 2002 నుంచి ప్రతి ఐదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీ రాష్ట్ర ప్రజలది. దీంతో కాంగ్రెస్‌ మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువేనంటున్నారు. అయితే.. ఇటీవల కాంగ్రెస్‌లో చీలికల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం.. హైకోర్టు తీర్పుతో అభాసుపాలైంది. ఆ పరిణామాల ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుంది.. బీజేపీ గెలుస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

మోదీ నాయకత్వం..రాష్ట్రపతి ఎన్నికపై ప్రభావం!
పెద్ద నోట్ల రద్దుతో సొంత పార్టీలో వ్యక్తమవుతున్న అసంతృప్తి.. తనపై అసమ్మతిగా మారకుండా ఉండాలంటే యూపీలో బీజేపీ గెలుపు మోదీకి అత్యవసరం. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదంతో 1991 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ మెజారిటీ సాధించింది. ఆ తర్వాత బీఎస్పీతో కలిసి సంకీర్ణ సర్కార్లు నడిపింది. 2014లో మాదిరిగా ఫలితాలు సాధిస్తే, మిగిలిన రెండేళ్లూ ప్రధానిగా మోదీ ప్రయాణానికి ఢోకా ఉండదు. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ  ప్రధాని అనుకున్న నేతే ఎన్డీఏ అభ్యర్థి అవుతారు(అందరూ అంగీకరిస్తే మాజీ ఉపప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీయే అభ్యర్థి!).

ఒకవేళ యూపీలోని మొత్తం 403 సీట్లలో సర్కారు ఏర్పాటుకు అవసరమైన 202 సీట్లు బీజేపీకి దక్కకపోతే, మోదీకి పార్టీలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. రాష్ట్రపతి పదవికి యూపీ బ్రాహ్మణవర్గానికి చెందిన మాజీ కేంద్ర మాజీ మంత్రి మురళీమనోహర్‌ జోషీ పేరును మోదీ ఒప్పుకోక తప్పని పరిస్థితి రావొచ్చు.బీజేపీలో, ప్రభుత్వంలో తమకు అడ్డులేకుండా ఉండేందుకు ఆడ్వాణీతోపాటు జోషీని మోదీ–అమిత్‌షా ద్వయం మార్గదర్శక్‌ మండల్‌ పేరుతో 2014లోనే మూలన పెట్టడం  తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement