యూపీ కిరీటం బీజేపీకే?
న్యూఢిల్లీ: కీలకమైన యూపీలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియాటుడే సర్వే వెల్లడించింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిపిన ఈ సర్వేలలో ప్రజలు నోట్లరద్దు ప్రభావం తమపై లేదని చెప్పారు. నోట్ల రద్దుకు ముందు 31 శాతం మంది బీజేపీపై సానుకూలత వ్యక్తం చేయగా.. డిసెంబర్‌లో ఈ సంఖ్య 33 శాతానికి పెరిగింది. ఈ లెక్క ప్రకారం 403 సీట్లున్న అసెంబ్లీలో కమలదళానికి 206–216 సీట్లు రావొచ్చని అంచనా. అధికార సమాజ్‌వాదీ పార్టీ 26 శాతం ఓట్లతో (92–97 శాతం) రెండో స్థానంలో మాయావతి బీఎస్పీకి 79–85 సీట్లు రావొచ్చని సర్వే తెలిపింది.
27 ఏళ్లుగా యూపీలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. సింగిల్ డిజిట్‌కే పరిమితం (5–9 సీట్లు) కావాల్సి వస్తుందని సర్వే తెలిపింది. కాగా, సీఎంగా 33 శాతం ఓట్లతో అఖిలేశ్ మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు, ఏబీపీ న్యూస్–లోక్‌నీతీ సీఎస్‌డీఎస్ ఒపీనియన్ పోల్ ప్రకారం సమాజ్‌వాదీ పార్టీకి 141–151 సీట్లు (30 శాతం ఓట్లు) వస్తాయని అంచనా. బీజేపీ 27 శాతం ఓట్లతో 124–134 సీట్లు గెలుస్తుందని సీఎస్‌డీఎస్–ఏబీపీ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ముస్లిం ఓట్లలో 57% ఎస్పీకి, బీఎస్పీకి 14, బీజేపీకి 9, కాంగ్రెస్‌కు 7% దక్కనున్నాయి.
పంజాబ్‌లో ఎన్డీఏకు..: పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీదళ్–బీజేపీ కూటమికి మళ్లీ అధికారం దక్కకున్నా పెద్ద కూటమిగా నిలిచే అవకాశం ఉందని ఏబీపీ సర్వే తెలిపింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఎస్‌ఏడీ–బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం (50–58 సీట్లు) ఇవ్వాలని అభిప్రాయపడగా.. కాంగ్రెస్‌కు 41–49, ఆప్‌కు 12–18 సీట్లు వస్తాయంది. ఆప్ రూపంలోనే ఎన్డీఏకు నష్టం జరగొచ్చని చెప్పింది.