ఢిల్లీ చేతుల్లో కమల దళపతి ఎంపిక!
► రాష్ట్ర నేతల్లో కుదరని ఏకాభిప్రాయం
► సారథి పీఠం పల్లెకా.. పట్నానికా..?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి వారంలో కొత్త సారథి ఎంపిక కానున్నారు. అధిష్టానం పెద్దలు ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలతో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీ కోర్‌కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీల అధ్యక్షులతో రాష్ట్రపార్టీ ఇన్‌చార్జి కృష్ణదాసు విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జిల్లాల్లో పార్టీ బలాబలాలు, రాష్ట్ర పార్టీ ముఖ్యుల మధ్య సంబంధాలు, కార్యకర్తల అభిప్రాయాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై ప్రతీ రాష్ట్ర నాయకుడు కృష్ణదాసుకు నివేదికలు సమర్పించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారన్న అంశంపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను జాతీయ పార్టీయే తీసుకోనుంది.
జాతీయపార్టీలో ఎవరెవరు?
బీజేపీ జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన పి.మురళీధర్‌రావు ఉన్నారు. ఆయనను జాతీయ కమిటీలోనే కొనసాగిస్తే మరో నాయకుడికి అవకాశం ఉండదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం(ఆరేళ్లు) పనిచేసిన జి.కిషన్‌రెడ్డికి అదేస్థాయిలో ఎక్కడ అవకాశం కల్పిస్తారనేది మరో ప్రశ్న. పి.మురళీధర్‌రావుతోపాటు పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కొనసాగుతున్న కె.లక్ష్మణ్ పేర్లు అధిష్టానం మదిలో ఉన్నట్టు ముఖ్యనేతలు చెబుతున్నారు. మురళీధర్‌రావును ఒప్పించి జాతీయపార్టీలోకి కిషన్‌రెడ్డిని తీసుకునే అవకాశాలున్నాయని మరోనాయకుడు వెల్లడించారు. ఈ ఇద్దరు ముందుకురాని పక్షంలో పార్టీలో మిగతా రాష్ట్ర నేతల మధ్య తీవ్రంగా పోటీ నెలకొంటుంది.
పల్లె ప్రాంతానికా.. పట్నానికా..?
రాష్ట్ర పార్టీ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉంది. గ్రామీణ ప్రాంతాలపై అవగాహన, పల్లె ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేయాలనే పట్టుదల లేకపోవడం వల్లనే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించలేకపోతున్నదని జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఎదగడానికి చాలా అవకాశాలున్నాయని వాదిస్తున్నారు. జిల్లాల నేతలకు అవకాశం ఇవ్వాలని, దీనివల్ల పల్లె ప్రాంతాల్లో పార్టీ బలం పెరుగుతుందంటున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. పి.మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్‌లు పార్టీ పగ్గాలను చేపట్టడానికి విముఖంగా ఉంటే పోటీ తీవ్రంగానే ఉంది. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్లు పేరాల చంద్రశేఖర్‌రావు, ఆచారి వంటి నేతల పేర్లను రాష్ట్ర పార్టీ నేతలు ప్రతిపాదించారు.