న్యూఢిల్లీ:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. శివసేనతో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోవడంతో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగే యోచనలో ఉంది. 151 స్థానాల్లో పోటీ చేసి తీరుతామని బెట్టు చేస్తున్న శివసేనను శాంతింపజేసేందుకు బీజేపీ ఒక ప్రతిపాదన చేసింది.అయితే ఒకవేళ సీట్ల సర్దుబాటులో శివసేనతో కొలిక్కిరాని పక్షంలో కచ్చితంగా ఒంటరిగా పోటీకి దిగుతామని బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూఢీ తెలిపారు. ఈ అంశంలో శివసేనతో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నా.. పొత్తును ఎలాగైనా కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది.
మధ్యే మార్గంగా ఇరుపార్టీలు 135 సీట్లతో బరిలోకి దిగడానికి బీజేపీ సూచించినా.. శివసేన మాత్రం 119 సీట్లను మాత్రమే బీజేపీకి ఇవ్వడానికి సుముకంగా ఉంది. మరో 151 స్థానాల్లో తాము ఎట్టి పరిస్థతుల్లోనూ పోటీకి దిగుతామని శివసేన పట్టుబడుతోంది. కాగా, శివసేన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి మాత్రం తాము సుముఖంగా లేనట్లు రూఢీ తెలిపారు. ప్రస్తుతం చేసిన ప్రతిపాదనకు శివసేన అంగీకరించకపోతే మాత్రం 25 ఏళ్ల తమ సాన్నిహిత్యానికి తెరపడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.