దమ్ముంటే తలాక్ ఇవ్వు? మిత్రపక్షానికి సవాల్!
పేరుకు మిత్రపక్షాలైనా రోజూ విమర్శించుకోవడం, ఒకరినొకరు దుయ్యబట్టుకోవడం బీజేపీ-శివసేనకు ఇటీవల నిత్యకృత్యంగా మారింది. రాజకీయంగా చాలా పాతకాలపు మిత్రులైనప్పటికీ ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య దూరం నానాటికీ పెరుగుతోంది. ఇన్నాళ్లు బీజేపీ లక్ష్యంగా శివసేన తీవ్రస్థాయిలో విమర్శలు సంధిస్తూ వచ్చింది. తన అధికార పత్రిక 'సామ్నా'లో కేంద్రంలోని మోదీ సర్కార్‌ను, బీజేపీని తీవ్రంగా ఎండగడుతూ సంపాదకీయాలు ప్రచురిస్తూ వచ్చింది. ఈ విమర్శలపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కమలనాథులు ఇప్పుడు ఘాటుగా దీటుగా బదులిచ్చారు. మహారాష్ట్ర బీజేపీ అధికార పత్రిక 'మనోగత్'లో శివసేనకు నేరుగా సవాళ్లు విసిరారు. కావాలంటే బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవచ్చునని తేల్చిచెప్పారు.
'రావత్ ఎప్పుడు తలాక్ (విడాకులు) తీసుకుంటారు?' అన్న శీర్షికతో బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి మాధవ్ భండారి ఓ వ్యాసం ప్రచురించారు. బీజేపీపై శివసేన నేత సంజయ్ రావత్ విమర్శలను తీవ్రంగా ఖండించిన ఆయన.. కావాలంటే బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవచ్చునని తేల్చి చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు కేంద్రంలోనూ, అటు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా ఉంది.