ఒత్తిడిలో కమలం!
బిల్లులో సవరణల కోసం ఇరుప్రాంతాల పార్టీ నేతల పట్టు
ఇరు ప్రాంతాల నేతలను సమాధానపరిచే యత్నంలో నేతలు
తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే.. సీమాంధ్ర సమస్యలపై రాజీ పడబోమంటూ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లులో సవరణల కోసం బీజేపీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ బీజేపీ నేతలు రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌లను కలిసి బిల్లులో చేయాల్సిన సవరణల పత్రాలను అందజేశారు. హరిబాబు, శాంతారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘునాథబాబు తదితరులతో కూడిన సీమాంధ్ర నేతల బృందం ఈ నేతలను కలిసి, 14 సవరణలను, డిమాండ్లను వివరించింది. పోలవరం మినహా మిగతా డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని తెలిపింది. సీమాంధ్రకు రెవెన్యూ లోటు, ఉమ్మడి రాజధానిపై తలెత్తే చిక్కుల విషయంలో అరుణ్ జైట్లీ కూడా సీమాంధ్ర నేతలతో ఏకీభవించినట్టు సమాచారం. సీమాంధ్రుల డిమాండ్ల విషయంలో రాజీ పడేదిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
తాజాగా సోమవారం తెలంగాణకు చెందిన బీజేపీ శాసన సభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలతో కూడిన బృందం 10 సవరణలు కోరుతూ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్‌లను కలిసింది. హైదరాబాద్‌ను మూడేళ్ల వరకే ఉమ్మడి రాజధాని చేయాలని, ఆ తరువాత సీమాంధ్రులు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేలా బిల్లులో సవరణలు తేవాలని కోరింది. సీమాంధ్రకు వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని, తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఆ ప్రాంతంలో పింఛను అందించాలని, ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఈ బృందం కోరింది. ఇరు ప్రాంతాల నేతలు గట్టిగా వాదనలు వినిపిస్తుండటంతో పార్టీ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే.., సీమాంధ్రుల సమస్యల విషయంలో రాజీపడబోమని ఇరు ప్రాంతాల నేతలను సమాధానపరిచే ప్రయత్నంలో ఉన్నారు.
నేడు పార్టీ వైఖరి స్పష్టమవుతుంది: నాగం
‘బీజేపీ విధానం చిన్న రాష్ట్రాలకు అనుకూలం. అందులో ఎలాంటి మార్పులేదని పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేస్తున్నారు’ అని పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సోమవారం రాత్రి మీడియాకు చెప్పారు. మంగళవారం బిల్లు పెట్టిన తర్వాత పార్టీ వైఖరి స్పష్టమవుతుందని తెలిపారు. ‘ఇప్పుడు సవరణలు చేయకపోతే మోడీ అధికారంలోకి వచ్చాక సవరణలు చేయించుకుందామని సీమాంధ్ర బీజేపీ నేతలే చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని నాగం అన్నారు. చంద్రబాబు సమన్యాయం నాటకాలకు తెరదించాలన్నారు.