
లోక్‌సభ స్పీకర్‌పై బీజేపీ ‘అవిశ్వాసం’!
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో జేపీసీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీరుపై బీజేపీ మండిపడింది. దీనికి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో పడింది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే, నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్ దక్షిణాఫ్రికా వెళ్లినందున ఆమె తిరిగి ఇక్కడకు వచ్చాక ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2జీ వ్యవహారంలో తాము సమర్పించిన అసమ్మతి నోట్‌ను జేపీసీ చైర్మన్ పీసీ చాకో తన నివేదికలో ఇష్టానుసారంగా కుదించడంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు స్పీకర్ అనుమతించని కారణంగా, ఆమెపై అసమ్మతి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. చాకో తన నివేదికలో అసమ్మతి నోట్‌లోని పలు భాగాలను తొలగించడాన్ని రాజ్యసభలో బీజేపీ ఉపనేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు.
జేపీసీ నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు సైతం అనుమతించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైతం యూపీఏ సర్కారు, కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. తొలుత అవినీతికి పాల్పడటం... తర్వాత దాన్ని కప్పిపుచ్చేందుకు రాజ్యాంగ సంస్థలను నీరుగార్చడం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, జేపీసీ నివేదిక వ్యవహారంపై స్పీకర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. నివేదిక సభ ముందుకు రానిదే దానిపై చర్చకు అనుమతించలేమని, నివేదిక సభ ముందుకు వచ్చాక అది సభకు చెందినదవుతుందని పేర్కొంది. ఒక అంశంపై స్పీకర్ రూలింగ్ ఇచ్చాక అదే అంతిమమవుతుందని, దానిపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు వీలుండదని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం పార్లమెంటరీ సంప్రదాయం కాదని పేర్కొంది. కాగా, 2జీ కుంభకోణంలో దోషులను కాంగ్రెస్ సిగ్గులేకుండా జేపీసీ ద్వారా వెనకేసుకొస్తోందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. చాకో ఈ అంశంలో జేపీసీ చైర్మన్‌గా కంటే ఎక్కువగా కాంగ్రెస్ ఏజెంటుగానే వ్యవహరించారని విమర్శించారు.
స్పీకర్ నిర్ణయాన్ని బట్టి మా నిర్ణయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు యూపీఏపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తాము మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘‘అవిశ్వాస తీర్మానాన్ని.. లోక్‌సభ స్పీకర్ ఆమోదించాల్సి ఉంది. దాన్ని సభలో ప్రవేశపెట్టాలంటే.. కొంత మంది సభ్యుల మద్దతు అవసరం’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్ గనక దాన్ని ఆమోదిస్తే.. అప్పుడు మద్దతు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తామని చెప్పారు.