
‘చే’ను చెరిపేయడం సాధ్యమేనా?
కోచి: ఎర్నెస్టో చే గువేరా...పేరు వింటేనే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అర్జెంటీనాలో పుట్టి క్యూబా విప్లవంలో చురుగ్గా పాల్గొని బొలీవియాలో అమెరికా మూకల చేతుల్లో మరణించిన ఆయన విప్లవానికే చిహ్నంగా చరిత్రలో నిలచిపోయారు. ప్రపంచ దేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా యువతకు, ముఖ్యంగా మార్క్సిస్టు భావాజాలాన్ని విశ్వసించే యువకులకు ఆయనెంతో ఆదర్శం, స్ఫూర్తి. దేశంలో తొలి కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళలో యువతకు ‘చే’ అంటే దైవంతో సమానం.
1970 దశకంలో కేరళ కాలేజీ గోడలపైనా, ప్రభుత్వ భవనాలపైనా, బిల్ బోర్డులపైనా ఎక్కడ చూసినా చే బొమ్మలు, పెయింటింగ్స్ కనిపించేవి. ఆ నాటి స్థాయిలో కాకపోయినా అవి ఇప్పటికీ కనిపిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘చే’ పేరుతో అనేక క్లబ్బులు కూడా నడుస్తున్నాయి. 40 మంది యువతతో ఏర్పడిన ‘చే గువేరా బాయ్స్’ అనే సంస్థ క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. పేద విద్యార్థులకు ఫీజులు కడుతోంది. చే పట్ల యువతలో ఉన్న ఆరాధన భావనను సొమ్ము చేసుకునేందుకు చే బొమ్మలతో టీ షర్టులు, కీ చైన్లు, చొక్కా బ్యాడ్జీలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఆఖరికి చెప్పులు కూడా వచ్చాయి. ‘డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యులు చే పాదరక్షకుల షాపులపై దాడులు జరిపి ధ్వంసం చేశారు.
వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగానున్న కేరళలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. గత ఎన్నికల్లోనే ఒక్క సీటుతో బోణి కొట్టింది. చేగువేరా లాంటి వ్యక్తుల భావాజాలంలో పడిపోవడం వల్లనే యువతను తమ పార్టీవైపు ఆకర్షించలేక పోతున్నామని బీజేపీ, దాని అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ భావించింది. అందుకనే కేరళలో ఎక్కడా చేగువేరా బొమ్మలు కనిపించకుండా చెరిపేయాలని కేరళ బీజేపీ శాఖ ప్రధాన కార్యదర్శి ఏఎన్ రాధాకృష్ణన్ తాజాగా పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు భావాజాలం ఎక్కువగా ఉన్న కేరళలో తమ భావజాలాన్ని తీసుకరావడం కోసం బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది.
1928లో మరణించిన ప్రముఖ సామాజిక సంస్కర్త నారాయణ గురును హిందూ సాధువుగా ముద్రవేసేందుకు గత సెప్టెంబర్‌లో ప్రయత్నించి విఫలమైంది. అంతకుముందు కేరళ పంటల పండుగ ‘ఓనం’ను విష్ణుమూర్తి అవతారమైన వామనుడి ‘పుట్టిన రోజు’గా జరిపేందుకు కూడా విఫలప్రయత్నం చేసింది. ‘హాపీ వామన జయంతి’ అంటూ గతేడాది పండుగ రోజున బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పంపిన సందేశంపై కేరళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు.
చేగువేరా పేరు, బొమ్మ తప్ప ఆయన గురించి ఏమీ తెలియని నేటి యువతరం ఆయన గురించి తెలుసుకునేందుకు బీజీపీ పిలుపు దోహద పడుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పుకుట్టన్ వల్లికున్ను వ్యాఖ్యానించారు. గోడలపై చే బొమ్మలను చెరిపేసినంత మాత్రాన తమ గుండెల్లో భద్రంగా దాచుకున్న ‘చే’ను ఎవరూ చెరిపేయలేరని మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైతే బీజేపీ ప్రయత్నాలను గట్టిగానే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆరెస్సెస్, వామపక్ష పార్టీల మధ్య జరిగిన సంఘర్షణల్లో వందలాది మంది మరణించిన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలో దారులు వేరైనా రక్తధారాలకు ఆస్కారం ఇవ్వరాదన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో మౌలిక సూత్రం కావాలి.
–ఓ సెక్యులరిస్ట్ కామెంట్