బిల్లు ఆమోదం సరికాదని చెప్పాం: సుష్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విషయంపై కేంద్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈరోజు బిల్లు పెడుతున్నట్టు తమకు కనీస మాత్రంగా కూడా చెప్పలేదన్నారు. తెలంగాణ బిట్లును అనుబంధ ఎజెండా పెట్టినట్టు తమకు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదన్నారు. ఇంత గందరగోళం మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం సరికాదని ప్రధానికి చెప్పామన్నారు. తమ సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఇక తాము ప్రభుత్వంతో ఏ రూపంలోనూ చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.
స్పీకర్ తన స్థానంలోకి రావడానికి నిమిషం ముందే ఘర్షణ ప్రారంభమైందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి ముందే ఆ పార్టీ ఎంపీలు ఇలా చేయడమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో జరిగిందంతా కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలన్నిటికీ కాంగ్రెస్దే బాధ్యతన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు.