ప్రతిదానికి మోడీని నిందిస్తే ఎలా?
గువాహటి: అస్సాంలోని బోడో ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుండగానే రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. బీజేపీ నడుపుతున్న విద్వేష రాజకీయాల ఫలితమే బోడో ప్రాంతంలో జరిగిన హింసాకాండ అని కాంగ్రెస్ నాయకలు మీమ్ అఫ్జాల్ వ్యాఖ్యానించారు.
కేంద్రం, అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గుర్తు చేశారు. ప్రతిదానికి అనవసరంగా నరేంద్ర మోడీని నిందించడం సరికాదని అన్నారు. అసోంలో జరిగిన హింసాకాండ దురదృష్టకరమని, ఖండించదగినదని చెప్పారు. రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి ఇది సమయం కాదన్నారు.
శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. పరస్పరం నిందించుకోవడం మానేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. కోక్రాఝర్, బక్సా మారణహోమంపై అస్సాం సీఐడీ విభాగం దర్యాప్తు చేపట్టింది. కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో తీవ్రవాదులు మైనారిటీ వర్గాల ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 32 మంది మృతి చెందారు.