
ఈ పాట వింటే.. సింగర్లు చిన్నబోవాల్సిందే
టాలెంట్ ఎక్కడ ఎలా దాగి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవరైనా గుర్తించి.. దాన్ని వెలికి తీసేవరకు ఆ నిప్పునకు నివురు కప్పే ఉంటుంది. జార్ఖండ్లోని బ్రజ్కిశోర్ అంధుల పాఠశాలలో చదువుతున్న తుంపా కుమారి అనే ఈ చిన్నారి.. బాలీవుడ్ సింగర్లందరినీ తలదన్నే టాలెంటును ప్రదర్శించింది. ప్రస్తుతం యూట్యూబ్తో పాటు సోషల్ మీడియా అంతటా ఈమె వీడియో హల్చల్ సృష్టిస్తోంది. 2013 సంవత్సరంలో విడుదలైన సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ లవ్ స్టోరీ 'ఆషికీ 2' సినిమాలోని టాప్ సాంగ్ 'సున్ రహా హై నా తూ' పాటను.. ఆమె అత్యంత అద్భుతంగా పాడింది.
ముఖ్యంగా ఈ పాటలోని ఆరోహణ.. అవరోహణలను అవలీలగా ఆమె పాడిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలోని గమకాలను అలవోకగా ఆమె ఆలపించింది. సినిమాలో శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటను చిన్న బాలిక పాడటం చూసి నెట్ ప్రపంచం ఆమెకు జోహార్లంటోంది. ఎవరైనా సంగీత దర్శకుల దృష్టికి ఈమె టాలెంట్ వెళ్తే మాత్రం.. తిరుగులేకుండా ఆమె దేశం గర్వించదగ్గ గాయని అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో కూడా 'మీరు చేస్తున్న పని తక్షణం ఆపేసి.. ఈ వీడియో చూడండి. ఈ పాప పాడిన పాట చూస్తే, బాలీవుడ్ సింగర్లంతా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే' అన్న సందేశంతో పాటుఈ వీడియో షేర్ అవుతోంది. మరి ఆలస్యం ఎందుకు.. మీరు కూడా ఈ పాట చూడండి.