
'దొంగచాటుగా కాల్పులెందుకు?'
దొంగచాటుగా కాల్పులు ఎందుకు జరుపుతున్నారని భారత అధికారులు పాకిస్థాన్ అధికారులను బుధవారం ప్రశ్నించనున్నారు.
న్యూఢిల్లీ: దొంగచాటుగా కాల్పులు ఎందుకు జరుపుతున్నారని భారత అధికారులు పాకిస్థాన్ అధికారులను బుధవారం ప్రశ్నించనున్నారు. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన అత్యున్నత స్థాయి సమావేశం మధ్యలోనే రద్దయిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాలమధ్య ప్రతి రోజు ఓ రకమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా బుధవారం ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతుంది. ఇందులో మొత్తం 16మంది సభ్యులు పాల్గొంటున్నారు.
వీరంతా కూడా సరిహద్దులో కాపలాకాసే బీఎస్ఎఫ్ బలగాల ఉన్నతాధికారుల స్థాయికి చెందిన వారు. ఈ నేపథ్యంలో భారత్ మూడు కీలక అంశాలను పాక్ ఉన్నతాధికారులను ప్రశ్నించనుంది. అందులో ఒకటి అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఎందుకు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నారు? దొంగచాటుగా బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులు ఎందుకు చేస్తున్నారు? రాణ్ ఆఫ్ కచ్ భూభాగంలోకి ఎందుకు చొరబడుతున్నారనే అంశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి సమావేశం లాహోర్లో 2013 డిసెంబర్లో జరిగింది.