
నాలుగు రూట్లు.. ఒకే టికెట్!
ఊరికెళ్లాలంటే రాను, పోను టికెట్లు ముందే బుక్ చేస్తాం. మరి నాలుగు ఊళ్లు వెళ్లాలంటే రిజర్వేషన్ కోసం పెద్ద కుస్తీయే పట్టాలి.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఊరికెళ్లాలంటే రాను, పోను టికెట్లు ముందే బుక్ చేస్తాం. మరి నాలుగు ఊళ్లు వెళ్లాలంటే రిజర్వేషన్ కోసం పెద్ద కుస్తీయే పట్టాలి. అలాకాక ఒకే టికెట్‌పై నాలుగు రూట్లలో ప్రయాణించే వీలుంటే!! ఇలాంటి సౌకర్యాన్ని బస్‌ఇండియా.కామ్ పోర్టల్ ఆరంభించింది. ‘ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా’ అంటూ... భారత్‌లో తొలిసారిగా ఈ సేవలను ఆవిష్కరించామని పోర్టల్‌ను నిర్వహిస్తున్న రేడియంట్ ఇన్ఫో సిస్టమ్స్ సీఎండీ వేణు మైనేని చెప్పారు. బస్‌ఇండియా.కామ్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నారంటే...ఆపరేటర్లు ఎవరైనా...
ప్రయాణికులు ఏ నగరం వారైనా... ఏ బస్ ఆపరేటర్ అయినా సరే... బస్‌ఇండియా.కామ్‌లో ఒకే లావాదేవీతో అది కూడా ఒకే టికెట్ తీసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తి తిరుపతి వెళ్తున్నారనుకుందాం. అక్కడి నుంచి చెన్నైకి, తిరిగి బెంగళూరుకు, అటు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటే.. ప్రయాణికుడు తనకు నచ్చిన టైంలో, నచ్చిన బస్‌లో వెళ్లొచ్చు. నాలుగు రూట్లకు కలిపి ఒకే టికెట్ వస్తుంది. ఆన్‌లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. భారత్‌లో మేం మాత్రమే ఈ విధమైన వినూత్న సేవలు ప్రారంభించాం.
తొలి స్థానం మాదే...: భారత్‌లో తొలిసారిగా ఆన్‌లైన్ బస్ రిజర్వేషన్ సేవలను 2006లో కర్ణాటక రాష్ట్ర ఆర్టీసీ కోసం ప్రవేశపెట్టాం. మొదట్లో అక్కడ రోజుకు 8,500 టికెట్లు బుక్ చేశాం. ఇపుడు ఆ సంఖ్య 25,000కు చేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల వద్ద సుమారు 1.47ల క్షలు, ప్రైవేటు ఆపరేటర్ల వద్ద సుమారు 30 వేల బస్సులున్నాయి. 80 శాతం బస్సుల్ని మేం కవర్ చేస్తున్నాం. మొత్తంగా రోజుకు 49 వేల టికెట్లు విక్రయిస్తూ దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఈ అనుభవంతోనే ఇక్కడ అడుగుపెట్టాం. ప్రైవేటు బస్సుల రిజర్వేషన్ ప్రారంభించాం. ఆర్టీసీ బస్‌ల రిజ ర్వేషన్ వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 4,500 బస్‌లకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. వివిధ పోర్టల్స్ ద్వారా రోజుకు 40 వేల టికెట్లు బుక్ అవుతున్నాయి.
క్యాబ్ సర్వీసులు కూడా...
ప్రస్తుతం బస్ రిజర్వేషనే కాకుండా హోటళ్లను కూడా మా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లో ట్యాక్సీలను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తాం. ఈ సేవలతో కస్టమర్లకు మరింత చేరువవుతాం. వన్ స్టాప్ సొల్యూషన్ అందించాలన్నదే మా తాపత్రయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 1,000 టికెట్లు మొబైల్ ఫోన్ల ద్వారా బుక్ అవుతున్నాయి. రెండేళ్లలో మొత్తం టికెట్లలో వీటి వాటా 15 శాతానికి చేరుతాయని విశ్వసిస్తున్నాం.
ఇలా ప్రారంభించాం..
మా స్వస్థలం గుంటూరు జిల్లా లగడపాడు. మధ్య తరగతి కుటుంబం. 1991లో అమెరికా వెళ్లి ఎమ్మెస్ చేశా. భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో కోడూరు వినోద్, సి.నారాయణాచార్యులుతో కలిసి రేడియంట్ ఇన్ఫో సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. స్మార్ట్‌కార్డ్, ఇ-గవర్నెన్స్, ఆధార్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వర్తించాం. అమెరికా, యూకేల్లో సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు అందిస్తున్నాం. భారత్‌లో రవాణా సేవలపైనే దృష్టిపెట్టాం. 15 ఆర్టీసీలతో లాభం పంచుకుంటున్నాం. రేడియంట్ గ్రూపు దేశంలో రూ.100 కోట్లు, ఇతర దేశాల ద్వారా రూ.350 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఔత్సాహికులను ప్రోత్సహించి పారిశ్రామిక రంగంవైపు మళ్లేలా చేస్తున్నా.