
42 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్ని పర్వతం
శాంటిగో: చిలీలో మరో అగ్ని పర్వతం బద్ధలైంది. దాదాపు 42 సంవత్సరాల తర్వాత కాల్బుకో అనే అగ్ని పర్వతం గతంలో లేనంత స్థాయిలో విస్ఫోటనం చెందింది. దీంతో, దాదాపు 1,500 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇందులో నుంచి దట్టమైన పొగలు మాత్రమే రావడం తప్ప పెద్దగా లావాలుగానీ, అగ్ని జ్వాలలుకానీ రాకపోవడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తతో అప్రమత్తత ప్రకటించారు. అసలు తాము కాల్బుకో అగ్ని పర్వతం తమ దృష్టిలో లేదని, అది పేలుతుందన్న ఆలోచన కూడా తమకు రాలేదని అక్కడి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. 1972లో ఒకసారి కాల్పుకో బద్ధలైంది. చిలీలో మొత్తం 90 అగ్ని పర్వతాలు ఉండగా అందులోని అత్యంత ప్రమాదమైన మూడు అగ్ని పర్వతాల్లో ఇదొకటి.