అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని
సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు ఊరూరా ఊదర గొట్టిన తెలుగుదేశంపార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా ముంచేందుకు పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా పరిపాలన సంస్కరణల ముసుగులో సర్కారీ కొలువులకు కత్తెర వేయాలని నిర్ణయించింది. అందుబాటులోని అత్యాధునిక కార్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ పేరుతో కొత్త నియామకాలకు తిలోదకాలిచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది.
అందుకనుగుణంగా పరిపాలన సంస్కరణల పేరుతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్, ఏపీ ఎన్‌జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. వెంకటేశ్వర్లు, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, సభ్య కన్వీనర్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రను నియమించారు.