బాబాయి, అబ్బాయిల మధ్య మరో కొత్త పోరు
సమాజ్వాదీ పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగట్లేదు. తాజాగా మరో కొత్త యుద్ధానికి తెరతీశారు.
లక్నో: సమాజ్వాదీ పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగట్లేదు. తాజాగా మరో కొత్త యుద్ధానికి తెరతీశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీలో ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివ్పాల్ యాదవ్తో కలిసి ఐక్యంగా ప్రచారం చేస్తారా అనే ప్రశ్నకు సీఎం అఖిలేష్ యాదవ్ ఇచ్చిన సమాధానమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
''చాచా నాతో ఉన్నా లేకున్నా.. ప్రజలు నాతో ఉన్నారు. అది చాలు'' అంటూ అఖిలేష్ చెప్పారు. దీంతో ఈ కుటుంబంలో సమస్యలు ఇంకా క్లియర్ కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో శివపాల్ యాదవ్, టిక్కెట్ పంపకంలో వివక్ష చూపుతున్నారని సీఎం అఖిలేష్ వాదిస్తున్నారు. తనను సంప్రదించకుండానే మాపియా నుంచి రాజకీయాలోకి వచ్చిన ఆతిక్ అహ్మద్ను అభ్యర్థుల జాబితాలో శివ్పాల్ చేర్చడంపై అఖిలేష్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన కారాలు మిరియాలు నూరుతున్నారు.
గత నెల అలహాబాద్లో జరిగిన పార్టీ పంక్షన్లో ఆతిక్ అహ్మద్, అఖిలేష్కు చేరువ కావడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ను కనీసం దగ్గరకు కూడా రానీయకుండా చూశారట. నేరారోపణలు కల్గినవారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వకూడదనే అఖిలేష్ అభిప్రాయానికి వ్యతిరేకంగా శివ్పాల్ యాదవ్ వ్యవహరిస్తున్నారని సీఎం క్యాంప్ అఫీసులోని ఓ వ్యక్తి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి కూడా అభ్యర్థులను శివ్పాల్ ప్రకటిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు అఖిలేష్ వర్గాన్ని శివ్పాల్ అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. లక్నోలో జరిగిన పార్టీ రజతోత్సవాలలో అఖిలేష్కు సన్నిహితుడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారు జావెద్ అబ్దిని శివ్పాల్ స్టేజ్ మీదకు రానీయకుండా చేశారంట.
అఖిలేష్కు ఇష్టంలేని వ్యక్తులను, మంత్రి పదవుల నుంచి తొలగించిన సన్నిహితులను శివ్పాల్ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. శివ్పాల్ గత వారంలో విడుదల చేసిన 23 అభ్యర్థుల జాబితాలో అఖిలేష్ మంత్రి పదవి నుంచి తొలగించిన రాజ్ కిషోర్ సోదరుడు, బ్రిజ్ కిషోర్ సింగ్ లాంటి వాళ్లు ఉన్నారు. రాజ్ కిషోర్ సింగ్ను మంత్రి పదవి నుంచి బహిష్కరించిన అనంతరం ఆయన పలుమార్లు అఖిలేష్కు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలసిందే. అయితే టిక్కెట్లు కేటాయించినప్పటికీ, పోలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ అభ్యర్థుల జాబితాను పునఃసమీక్షిస్తామని అఖిలేష్ కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఓ వైపు బాబాయి, మరోవైపు అబ్బాయి పోరు అభ్యర్థుల ఎంపికతో మరో కొత్త రగడకు దారితీస్తుందని తెలుస్తోంది.