మార్చి 13 నుంచి ఫుల్‌ క్యాష్‌ | Cash withdrawal limits to go from March 13: RBI | Sakshi
Sakshi News home page

మార్చి 13 నుంచి ఫుల్‌ క్యాష్‌

Published Thu, Feb 9 2017 2:51 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

మార్చి 13 నుంచి ఫుల్‌ క్యాష్‌ - Sakshi

మార్చి 13 నుంచి ఫుల్‌ క్యాష్‌

- నగదు విత్‌డ్రా పరిమితులు ఎత్తివేస్తామన్న రిజర్వు బ్యాంకు
- 20 నుంచి సేవింగ్స్‌ ఖాతాల్లో విత్‌డ్రా పరిమితి 50 వేలకు పెంపు
- ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఆర్‌.గాంధీ, ముంద్రా వెల్లడి


ముంబై:
పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్‌డ్రాయల్స్‌పై విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న రిజర్వు బ్యాంకు... మార్చి 13వ తేదీ నుంచి పరిమితులను పూర్తిగా ఎత్తివేయనుంది. ఆలోగా ప్రస్తుతం వారానికి రూ. 24,000గా ఉన్న పొదుపు (సేవింగ్స్‌) ఖాతాల విత్‌డ్రాయల్స్‌ పరిమితిని ఫిబ్రవరి 20 నుంచి రూ. 50,000కు పెంచనుంది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ ఈ విషయాలు వెల్లడించా రు.

వ్యవస్థలోకి కొత్త రూ.500, రూ.2,000 నోట్ల సరఫరాను బట్టి కరెంటు ఖాతాలు, క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలు మొదలైన వాటి నుంచి విత్‌డ్రాయల్‌ ఆంక్షలను తొలగించినప్పటికీ.. పొదుపు ఖాతాలపై మాత్రం పరిమితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రూ. 2,000 నోట్లకు నకిలీలు వస్తున్నాయన్న వార్తలపై ఆర్‌.గాంధీ స్పందిస్తూ... అవన్నీ కలర్‌ జిరాక్స్‌లేనని, సామాన్యులు కూడా సులువుగా గుర్తుపట్టొచ్చని చెప్పారు. నకిలీ కరెన్సీకి ఆస్కారం లేకుండా కొత్త నోట్లలో పటిష్టమైన సెక్యురిటీ ఫీచర్లు ఉన్నాయన్నారు. రూ. 2,000 నోట్లకు సంబంధించి బ్యాంకింగ్‌ వ్యవస్థలో నకిలీలు దొరికిన దాఖలాలేమీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని తెలిపారు.

జూన్‌ తర్వాతే ‘నోట్ల రద్దు’డేటా..
డీమోనిటైజేషన్‌ (పెద్ద నోట్ల రద్దు) తర్వాత తిరిగొచ్చిన పాత రూ.500, రూ.1,000 నోట్లకు సంబంధించిన పూర్తి గణాంకాలు జూన్‌ తర్వాతే వెల్లడించడం సాధ్యపడుతుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా తెలిపారు. డీమోనిటైజేషన్‌ సమయంలో విదేశాల్లో ఉన్న వారు తిరిగొచ్చి డిపాజిట్‌ చేసేందుకు మార్చి 31 దాకా, ప్రవాస భారతీయులకు జూన్‌ 30 దాకా గడువుందని ఆయన గుర్తు చేశారు. అలాగే సహకార బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన మొత్తాలను, భారత కరెన్సీ చెల్లుబాటయ్యే నేపాల్, భూటాన్‌ దేశాల నుంచి వచ్చే నగదును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

జూన్‌ 30 నాటికి ఎన్నారైల డిపాజిట్లకు గడువు ముగిసిపోతుంది కనుక.. ఆ తర్వాతే సమగ్ర వివరాలు అందుబాటులోకి రాగలవని స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్‌కు ముందు మొత్తంగా దాదాపు రూ.15.45 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉన్నట్లు అంచనా. అందులో 86 శాతం వాటా పాత రూ. 500, రూ. 1,000 నోట్లదే. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు రూ.9.92 లక్షల కోట్లు విలువ చేసే కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తెచ్చినట్లు గాంధీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement