
రాజస్థాన్‌లో సం‘కుల’ సమరం!
రాజస్థాన్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : పోలంపెల్లి ఆంజనేయులు: రాజస్థాన్‌లో అధికారం కోసం మరో రెండు రోజుల్లో సంకుల సమరం సాగనుంది. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండగా, డిసెంబర్ 1న(ఆదివారం) రాష్ట్రంలోని 200 స్థానాలకుగాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ అధికారం కోసం హోరాహోరీ పోరు సాగించినా... ఎవరికి ఓటెయ్యాలనేదానిపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ ‘సంక్షేమ’ మంత్రం, బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మాలతో రెండు వారాల పాటు ప్రచారాన్ని హోరెత్తించినా ... ఆయా పార్టీలు ఏ కులానికి ప్రాధాన్యత ఇస్తాయి? పోటీ చేసే అభ్యర్థుల సామాజిక వర్గం తదితరాలే 60 శాతం వరకు గెలుపు ఓటములను శాసించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది.
2008లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించినప్పటికీ... అవినీతి, అక్రమాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు అపఖ్యాతి పాల య్యారు. ఓ మంత్రి జైల్లో ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉచిత మందుల పథకాన్ని తీసుకొచ్చి పలుచబడ్డ తన ప్రతిష్టను కొంతమేర పునరుద్ధరించుకోగలిగారు. ఆరు నెలల క్రితం పింఛన్ల పథకాన్నితీసుకొచ్చి పేద ల్లో మరోసారి తన బలాన్ని పెంచుకున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి ఆరోపణలు ఆయన ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. జైపూర్ నగరంలోని 8 నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు పోటీచేస్తున్నవి కొన్నైతే... మరికొన్ని రిజర్వుడు స్థానాలు.. ఇవి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కుల సమీకరణాలే అత్యంత కీలకంగా మారాయి.
నాలుగైదు కులాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం...
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో జాట్ , రాజ్‌పుట్, బ్రాహ్మిణ్, గుజ్జర్లు, మీనా, ముస్లిం సామాజిక వర్గాలు కీలకం. 12 జిల్లాల్లోని 60 నియోజకవర్గాల్లో జాట్ వర్గీయులకు చెందిన వారే ఎన్నికయ్యే పరిస్థితి. మరో 14 నియోజకవర్గాల్లో ఈ సామాజికవర్గం గెలుపు-ఓటములను ప్రభావితం చేయగలదు. వీళ్లంతా ఇప్పటి వరకు సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లుగానే ఉన్నారు. అయితే ఈసారి బీజేపీ కూడా వీరికి ప్రాధాన్యత ఇస్తూ టిక్కెట్లు కేటాయించింది. తరువాత ప్రభావితం చేసే సామాజిక వర్గం రాజ్‌పుట్. ఈ వర్గానికి చెందిన వారు 12 నియోజకవర్గాల్లో 60 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు.
ఈ సామాజిక వర్గం పూర్తిగా బీజేపీకి అనుకూలం. వసుంధర రాజే మొదలుకొని రాజకుటుంబానికి చెందిన వారంతా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉన్న వీరు దేశ స్వాతంత్య్రానికి ముందే గ్రామాల్లో బలమైన శక్తిగా ఉన్నారు. బికనూరు, జున్‌జున్, శిఖర్, జోధ్‌పూర్, బార్మర్, జైసల్మేర్‌లలో పూర్తిగా వీరే కీలకం, రాష్ట్రంలోని 25 మంది రాజ్‌పుట్‌లకు బీజేపీ టికెట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ 13 చోట్ల వీరిని నిలిపింది. మీనా వర్గానికి చెందిన వారు దక్షిణ రాజస్థాన్‌లోని దాదాపు 25 సీట్లలోనే గాకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యేక గ్రూపులుగా ఉన్నారు.
సంగ్మాకు చెందిన నేషనలిస్టు పీపుల్స్ పార్టీకి రాష్ర్టంలో నాయకత్వం వహిస్తున్న స్వతంత్ర ఎంపీ డాక్టర్ కిరోడీలాల్ మీనా ప్రస్తుతం ఈ సామాజిక వర్గం ముఖ్య నేతగా ఉన్నారు. 148 సీట్లలో ఎన్‌పీపీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో... రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వంలో వీరు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో కీలక సామాజిక వ ర్గం గుజ్జర్లు..వీరు తొలి నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉండేవారు. అయితే గుజ్జర్లను ఎస్‌టీల్లో చేర్చే విషయంలో 2008కు ముందు వసుంధర రాజే ప్రభుత్వం సహకరించలేదన్న వ్యతిరేకత కొంత ఉంది. కరోడీలాల్ మీనా బీజేపీ నుంచి బయటకు రావడానికి కూడా ఇదే కారణం. ఎస్సీలు కూడా ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ఉండడం గమనార్హం. బనియా సామాజిక వర్గం కూడా బీజేపీ సంప్రదాయ ఓటరుగానే ఉంటూ వస్తోంది. ముస్లింలు ఈసారి కాంగ్రెస్ వెంట నడిచే పరిస్థితి నెలకొంది.