కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం రుణం పొందారని ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు మోపింది.
హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది.
అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్‌కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్‌లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్‌లో పొందుపర్చింది.
నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు.