మీడియా అధిపతికి సీబీఐ ఝలక్!
న్యూఢిల్లీ: అనూహ్యరీతిలో సీబీఐ సోమవారం ఉదయం జాతీయ న్యూస్ చానెల్ ఎన్టీటీవీ సహ యాజమానులైన ప్రణవ్ రాయ్, రాధికా రాయ్ ఇళ్లలో దాడులు నిర్వహించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ధ్రువీకరించింది.
అయితే, ఎన్టీటీవీ కార్యాలయంలో ఈ సోదాలు జరగలేదు. ఎన్టీటీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ఇలా మొత్తం నాలుగుచోట్ల సీబీఐ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
2008లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన గతవారం సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రణయ్‌రాయ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 366 కోట్లు రుణంగా తీసుకొని.. రూ. 50 కోట్లు తక్కువ చెల్లించినట్టు సీబీఐ వర్గాలు చెప్తున్నాయి.