సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కుల్లో నెలకొన్న అనారోగ్యకర పోటీని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్‌లో మార్కుల విధానాన్ని తొలగించి, సీబీఎస్‌ఈ తరహాలో గ్రేడింగ్ విధానం అమలు చేసే దిశగా పరిశీలన జరుపుతోంది. వీలైతే 2016 మార్చిలో జరిగే పరీక్షల్లోనే దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్రువీకరించారు.
పరీక్షల సంస్కరణలో భాగంగా గ్రేడింగ్ విధానంతోపాటు ఆన్‌లైన్‌లో జవాబు పత్రాల మూల్యాకనం పైనా అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీలైతే ఈ ఏడాది పరీక్షల్లోనే ఈ విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అధ్యయనం పూర్తయ్యాక దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
సీబీఎస్‌ఈలో ఇలా..
దేశవ్యాప్తంగా నడుస్తున్న పాఠశాలల్లోని విద్యార్థులందరిని పరిగణనలోకి తీసుకొని టాప్ మార్కులు సాధించినవారి సంఖ్య ఆధారంగా ‘9 పాయింట్ గ్రేడింగ్’ విధానాన్ని సీబీఎస్‌ఈ అమలు చేస్తోంది. విద్యార్థులకు గ్రేడ్‌లతోపాటు మార్కులను కూడా ఇస్తోంది. కానీ రాష్ట్రంలో మార్కులను వెల్లడించొద్దని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 9, 10 తరగతుల్లో గ్రేడింగ్ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. 6, 7, 8 తరగతుల్లోనూ ఇంటర్నల్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌లో గ్రేడింగ్ విధానంపై కసరత్తు చేస్తోంది.
ఇంటర్‌లో మార్కులకు స్వస్తి?
Published Sat, Aug 8 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement