పూంచ్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆదివారం కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మెంధార్ సబ్ సెక్టార్‌లో మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆటోమేటిక్, మధ్యరకం మోర్టార్ బాంబులను ప్రయోగించింది. భారత బలగాలు వీటిని గట్టిగా తిప్పికొట్టాయి. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ప్రాణనష్టం జరిగినట్లు వార్తలేవీ రాలేదని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్‌ఎన్ ఆచార్య తెలిపారు. పాక్ బలగాలు శనివారం అర్ధరాత్రి కూడా పూంచ్‌లోని కృష్ణఘాటీ, బాల్‌కోట్, హరీర్‌పూర్ లలో భారత పోస్టులపై కాల్పులు జరిపాయని, తమ బలగాలు దీటుగా స్పందించి తిప్పికొట్టాయన్నారు. మరోపక్క.. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఆదివారం వేకువజామున భారీ ఆయుధాలతో భారత్‌లోకి చొరబడేందుకు మిలిటెంట్లు చేసిన యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఇరు పక్షాల మధ్య మూడు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక మిలిటెంట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయారు.