సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై స్పందించిన నగ్మా
రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు ట్విట్టర్ లో దుమారం రేపుతుండగా.. మరో వైపు కొంతమంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా ‘సుల్తాన్’ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ఖండించారు.
సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్ మహిళలపై చిన్నచూపు చూడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ చేసిన పని తప్పే అయినా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అతని క్యారెక్టర్ ను శకించడం తగదని అన్నారు. బహుశా రేప్ బాధిత మహిళల జీవితం గురించి చెప్తూ ఇలా అని ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
ఇక రేప్ అనేది చిన్న విషయం అనే భావనను సల్మాన్ ప్రజల్లోకి పంపారని దీనిపై ఆయన క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదని ప్రముఖ కాలమిస్ట్ అన్నా ఎమ్. వెట్టికడ్ పేర్కొన్నారు. సల్మాన్ పై తనకు ఎలాంటి దురాభిప్రాయం లేదని కానీ, ఇలాంటి సంఘటనల్లో పురుషులకు వెన్నుదన్నుగా నిలబడటం ములాయం లాంటి వాళ్లకు సాయం చేసినట్లేనని, వాళ్లు అబ్బాయిలు వాళ్లు తప్పులు చేస్తూనే ఉంటారని అన్నావెట్టికాడ్ అన్నారు.
మహిళలపై సల్మాన్ వ్యాఖ్యలు అతని మైండ్ సెట్ ను తెలియజేస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం అన్నారు. సల్మాన్ లాంటి సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడే ముందు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. రేప్ అనే విషయాన్ని సల్మాన్ చిన్నవిషయంగా భావించలేదని, అయితే ఈ విషయంపై దేశమంతా ఇప్పుడు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని పూజా బేడీ వ్యాఖ్యానించారు.