
మంత్రులు సెల్‌ఫోన్లు తేవద్దు
♦ బయటే డిపాజిట్ చేయాలి
♦ సీఎం కార్యాలయం ఆదేశాలు
♦ అమాత్యుల తీవ్ర అసంతృప్తి
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రులు తమ సెల్‌ఫోన్లను బయటే డిపాజిట్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా మంత్రులు ఎక్కడికి వెళ్లినా తమ సెల్‌ఫోన్లను వెంట తీసుకెళుతుంటారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రులు తమ వెంట మంత్రివర్గ సమావేశాలకు ఫోన్లను తీసుకెళ్లటాన్ని అనుమతించటం లేదు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నపుడు ఈ పద్ధతిని అనుసరించిన సీఎం కార్యాలయం తాజాగా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోనూ అదే పద్ధతిని అవలంబిస్తోంది.
సెల్‌ఫోన్లను డిపాజిట్ చేయాలనటం పట్ల మంత్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సైలెంట్ మోడ్‌లో పెట్టుకునే వీలుందని, అంతగా అవసరమైతే స్విచ్ఛాఫ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉండగా బయటనే డిపాజిట్ చేయాలనడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రివర్గ సభ్యులపై ముఖ్యమంత్రికే నమ్మకం లేకపోతే, బయటి వారు ఎలా నమ్ముతారని అంటున్నారు. ఇది తమను అవమానించటం గాక మరేంటని వారు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గతంలో విజయవాడ క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి ఇదే విషయమై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తూ మాపైనే నమ్మకం లేకపోతే ఇంకెందుకయ్యా ఈ పదవన్న సంగతి తెలిసిందే.